భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు హిట్‌మ్యాన్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) పరిశీలిస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో ఎంసీఎ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత జట్టుకు చేసిన సేవలకు గాను రోహిత్‌ను ప్రత్యేక గౌరవంతో గుర్తించాలని ఎంసీఎ భావిస్తోంది. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.
వాంఖడే స్టేడియంలోని స్టాండ్స్, వాక్‌వేలకు మాజీ అధ్యక్షులు శరద్ పవార్, దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, దివంగత భారత కెప్టెన్ అజిత్ వాడేకర్, దివంగత ఏక్‌నాథ్ సోల్కర్, దివంగత దిలీప్ సర్దేశాయ్, దివంగత పద్మాకర్ శివాల్కర్, భారత మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ పేర్లు పెట్టాలని సభ్యుల నుంచి ఎంసీఏకి అభ్యర్థనలు అందాయి. ‘ఎంసీఎ సభ్యుల నుండి పలు సూచనలు వచ్చాయి. తుది నిర్ణయం ఎంసీఏ జనరల్ బాడీ సభ్యులు తీసుకుంటారు’ అని ఎంసీఎ అధ్యక్షుడు అజింక్య నాయక్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు. ఎంసీఎ అపెక్స్ కౌన్సిల్ ఏప్రిల్ 15న రోహిత్ శర్మ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తుందని సమాచారం.
Also Read: Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈరోజు తులంపై ఎంత పెరిందంటే?
ఎంఎస్ ధోనీ తర్వాత అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను టీమిండియాకు హిట్‌మ్యాన్ అందించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో జట్టును ఫైనల్ వరకు చేర్చాడు. 2007 టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ తరఫున ఆడుతున్న రోహిత్.. జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ముంబైలో జన్మించిన హిట్‌మ్యాన్.. అంచలంచెలుగా ఎదుగుతూ భారత జట్టుకు సారథి అయ్యాడు.