Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..

  • ముంబై నారిమన్ హౌజ్‌పై రెక్కీ..
  • 26/11 దాడులుకు గురైన ప్రాంతమే టార్గెట్..
  • ఒకరిని అరెస్ట్ చేసిన నవీ ముంబై ఏటీఎస్..
Nariman House

Nariman House

Mumbai Terror Plot: 26/11 ముంబై దాడుల్లో లక్ష్యంగా మారిన నారిమన్ హౌజ్‌పై రెక్కీ నిర్వహించారనే ఆరోపణలపై 20 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నవీ ముంబైలోని ఐరోలి ప్రాంతానికి చెందిన యశ్ సింగ్, ముంబైలోని కీలక ప్రాంతాలు, ముఖ్యంగా కొలాబాలో ఉన్న యూదుల మత, సాంస్కృతిక కేంద్రం చాబాద్ హౌజ్ వివరాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. విదేశాల్లో ఉన్న హ్యాండర్లకు ఈ ఫోటోలు, వివరాలు పంపించినట్లు ఆరోపించారు.

నవీ ముంబై యాంటీ టెర్రరిజం స్క్కాడ్(ఏటీఎస్) ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. సోషల్ మీడియా ద్వారా అంతర్జాతీయ నేర ముఠాలతో యశ్ సింగ్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడి కార్యకలాపాలకు కేరళలో నమోదైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కేసుతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేరళ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, కేరళ కేసులో ఉన్న సంబంధాలపై విచారించి అతడిని అరెస్ట్ చేశారు.

నారిమన్ హౌజ్‌పై నిఘా..

ముంబైలో సున్నితమైన ప్రాంతాలపై నిఘా పెట్టి సమాచారాన్ని సేకరించాల్సిందిగా నిందితుడికి సూచనలు అందినట్లు తేలింది. ముఖ్యంగా కొలాబాలోని చాబాద్ హౌజ్(నారిమన్ హౌజ్)పై అతను రెక్కీ నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. యూదుల మత కేంద్రంగా ఉన్న ఈ భవనం 2008 నవంబర్ లో జరిగిన 26/11 ఉగ్రదాడులకు గురైంది. ముంబైలో నివసిస్తున్న యూదులు, విదేశీయులు, వారి వ్యాపార సంస్థలకు సంబంధించిన వివరాలను కూడా సేకరించాలని ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

పాక్ ఉగ్రవాద నెట్వర్క్‌లో సంబంధాలు..

నవీ ముంబై ఏటీఎస్ చెప్పిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది షహజాద్ భట్టి నేర ముఠాతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నిరుద్యోగులకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న యువతను టార్గెట్ చేస్తున్నట్లు తేలింది. సున్నితమైన ప్రాంతాలపై రెక్కీ నిర్వహించడం, ఫొటోలు, ఇతర వివరాలు సేకరించడం వంటి పనులకు డబ్బు ఆశ చూపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెట్వర్క్‌తో నిందితుడికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో దీనిపై పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.