Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు

Mudragada

Mudragada

Mudragada Padmanabham: మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కిర్లంపూడిలో ముగిశాయి.. అయితే, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి పోలీసులు రావడం.. వారిని పద్మనాభం అనుచరులు అడ్డుకోవడంతో కాసేపు స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.. కానీ, తన మరణానంతరం కుటుంబ సభ్యులు అనుసరించాల్సిన విషయాలను వివరిస్తూ ముందుగానే ఒక లేఖ రాసి ఉంచారు ముద్రగడ.. తన అంత్యక్రియలు ఎలా నిర్వహించాలనే అంశంపై స్పష్టమైన సూచనలు చేస్తూ, తన వ్యక్తిగత అభిప్రాయాలను అందులో వెల్లడించారు.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తాను మరణిస్తే తన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించవద్దని ముద్రగడ పద్మనాభం ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసుల గౌరవ వందనం కూడా అవసరం లేదని స్పష్టం చేశారు. జీవించి ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టి, మరణానంతరం ఇచ్చే గౌరవం లేదా గుర్తింపు తనకు అవసరం లేదని లేఖలో పేర్కొన్నారు.

అలాగే కుటుంబ సంప్రదాయాల ప్రకారం తనకు దహన సంస్కారాలు చేయకుండా, ఖననం మాత్రమే చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఇంటి ఆవరణలో ఎక్కడ ఖననం చేయాలనే విషయాన్ని కూడా లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. అలా ఖననం చేస్తే తాను ఎప్పటికీ కుటుంబంతోనే ఉన్నట్లుగా భావిస్తానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా, తన మరణానంతరం తన భార్య బొట్టు, గాజులు తొలగించవద్దని, ఆమెను పుణ్యస్త్రీగానే కొనసాగించాలని కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ముద్రగడ రాసిన ఈ లేఖ ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.