MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!

Dhoni

Dhoni

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జెర్సీ నంబర్ 7తో ప్రత్యేక అనుబంధం ఉంది. తన క్రికెట్ కెరీర్ మొత్తం ఇదే నంబర్‌తో కొనసాగిన ధోనీ.. తాజాగా దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఓ న్యూమరాలజిస్ట్ జెర్సీ నంబర్ మార్చుకోవాలని సూచించినా తాను ఎందుకు అంగీకరించలేదో వివరించారు. 2004లో తొలిసారి భారత జట్టుకు ఎంపికైనప్పుడు ధోనీ తనకు జెర్సీ నంబర్ 7 కావాలని కోరారు. అయితే, ఆ నంబర్ విషయంలో ఆయనకు ఎలాంటి ప్రత్యేక నమ్మకాలు లేవని చెప్పుకొచ్చాడు. అందుబాటులో ఉంటే 7 ఇవ్వాలని అడిగానని, ఒకవేళ వేరే నంబర్ ఇచ్చినా సంతోషంగా స్వీకరించేవాడినని చెప్పారు.

ముంబైలో జరిగిన ‘ది పర్పుల్ కార్పెట్’ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ.. విమాన ప్రయాణంలో తనకు ఎదురైన ఓ ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకున్నారు. ఓ న్యూమరాలజిస్ట్ తనను కలిసి జెర్సీ నంబర్ 7 మార్చుకుంటే అదృష్టం మారుతుందని, మైదానంలో మంచి ఫలితాలు వస్తాయని సూచించినట్లు తెలిపారు. అయితే, ఆ సూచనను ధోనీ సున్నితంగా తిరస్కరించానని అన్నారు. ‘‘ఒకసారి 7 నుంచి 11కి మారమంటారు. మళ్లీ 11 నుంచి 15కి మార్చమంటారు. ఇలా నా తప్పులకు నేనే కారణం కాకుండా నంబర్లను నిందిస్తూ ఉంటానా..? నేను సరిగ్గా ప్రాక్టీస్ చేసి, చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేస్తే.. నాకు ఎలాంటి నంబర్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు’’ అని అతనితో చెప్పినట్లు వెల్లడించారు.

తన జెర్సీ నంబర్ 7కు ఇంతటి ప్రత్యేక గుర్తింపు రావడంలో అభిమానుల పాత్ర కూడా ఉందని ధోనీ తెలిపారు. అభిమానులు కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు ఇలా ఏదో ఒక విధంగా లెక్కలు వేసి చివరకు 7 వచ్చేలా చేసేవారని చెప్పారు. అయితే, తాను మాత్రం ఆ నంబర్ విషయంలో పెద్దగా మూఢనమ్మకాలు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. ‘‘మీరు ఏ నంబర్ ఎంచుకున్నా.. కాలక్రమంలో అదే మీ లక్కీ నంబర్‌గా మారుతుంది. మంచి వ్యక్తులు ఒక నంబర్‌తో అనుబంధం ఏర్పరుచుకుంటే.. ఆ నంబర్ ఏదైనా ప్రత్యేకంగా మారుతుంది’’ అని ధోనీ ఆ వేదికపై చెప్పుకొచ్చారు.