NTV Telugu Site icon

Margani Bharat: డబుల్ ఇంజిన్, త్రిబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఫలితాలు శూన్యం

Margani

Margani

ఇంజిన్లు ఎన్ని ఉన్నాయనేది ముఖ్యం కాదు.. అభివృద్ధి దిశగా ఏ మేరకు ప్రయాణించింది అన్నదే ప్రధానమని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ వ్యాఖ్యానించారు. దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలిత రాష్ట్రాలలో ఏ మేరకు అభివృద్ధి జరిగిందంటే సమాధానం ఉండదన్నారు. ఏపీలో జగనన్న సర్కారు అమలు చేసినన్ని సంక్షేమ పథకాలు.. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా అని ప్రశ్నించారు.‌స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు మరెక్కడా అమలు జరగలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం అన్ని పార్టీలూ ఏకమై, డబుల్, త్రిబుల్ ఇంజన్ల సర్కార్ అంటే ప్రజలేమీ అమాయకులు కాదన్నారు. ఏపీలో వైసీపీ ఇంజిన్ ఒకటే.. అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఇంజిన్లతో పని లేదు.. ఇంజిన్ కన్నా శరవేగంగా దూసుకుపోగల సత్తా జగనన్నది అని మార్గాని భరత్ అన్నారు.

Read Also: Samosa: సమోసాల్లో కండోమ్‌లు, గుట్కాలు.. అవి తిన్న వారికి..?!

ఏపీలో ఎన్నికల సమయం రావడంతో బీజేపీ నేతలు పలికే చిలక పలుకులకు ప్రజలేమీ మురిసిపోయేంత అమాయక స్థితిలో లేరని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఏపీకి కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎంత మేర న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏపీ పునర్విభజన హామీలు, నిబంధనలు ఏ మేర కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చేసిందో చెప్పాలన్నారు. ఏ ఒక్క విషయంలోనూ ఎన్డీఏకు క్లారిటీ లేదు.. 2014 ఏపీ విభజన విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రామయ్యపట్నం పోర్టు, రైల్వే జోన్.. ఇలా దేనిలోనూ కేంద్రంలోని ఎన్డీయేకు కానీ, ఆ కూటమిగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలకు‌ ఒక క్లారిటీ లేదన్నారు. మరి ఏ ఒప్పందంతో టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయొ అర్థం కావడం లేదని ఎంపీ భరత్ ప్రశ్నించారు.

Read Also: Unstoppable 4: బాలయ్య మళ్లీ వస్తున్నాడు గెట్ రెడీ

మిత్రుల పొత్తులో డొల్లతనం కోరుకొండ మండలం బూరుగుపూడి సమావేశంలో బయట పడిందని ఎంపీ భరత్ ఎద్దేవా చేశారు. ఫ్లెక్సీలో టీడీపీకి చెందిన ఒక నేత ఫొటో లేకపోవడంతో గందరగోళం ఏర్పడి, చివరికి సమావేశమే రద్దయినట్లు పేపర్లో చదివాను.. ఇదేమి రాజకీయాలు, ఇవేమి సమావేశాలని ప్రశ్నించారు. ఇదేనా మిత్రుల మధ్య ఐక్యత అంటూ ప్రశ్నించారు. ‌ఈ కూటమికి పొరపాటున అధికారం అప్పగిస్తే రాష్ట్రం అతుకుల బొంతలాగా మారుతుందన్నారు. అరాచకం పెరిగిపోతుందన్నారు. చిత్తశుద్ధితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఎంపీ మార్గాని భరత్ రామ్ కోరారు.

Show comments