నల్లగొండ జిల్లాలోని హాలియా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో వాళ్ళ దుర్మార్గాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలులో అడ్డంగా దొరికిన దొంగలు ఇప్పటికే జైలు పాలయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)తో నాయకుల బండారం బయటపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పటికే బీజేపీ ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచి రాష్ట్రాల హక్కులను కాలరాస్తు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని బడుగు లింగయ్య యాదవ్ మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఎమ్మెల్సీ కవితపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Also Read : Church Pastor: పాస్టర్ వింత చేష్టలు.. దేవుడు ఆ పని చేయమంటున్నాడంటూ
రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉన్న గవర్నర్ కూడా బీజేపీ నేతగా పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేసినప్పుడు స్పందించని గవర్నర్ ధర్మపురి అర్వింద్ ఇంటిపై కొంతమంది అలజడి సృష్టించడంతో వెంటనే స్పందించి ఆమె నైజాన్ని బయట పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ధర్మపురి అర్వింద్ ఎమ్మెల్సీ కవిత పై చేసిన ఆరోపణలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇటీవల సీఎం కేసీఆర్ తన కుమార్తె కవితను బీజేపీలో చేరాలని కోరారని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందిస్తూ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అయితే.. ఈ దాడి తరువాత ఎమ్మెల్సీ కవిత ఎంపీ అర్వింద్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.