Mother: అమ్మ అంటే అనురాగం.. కమ్మదనం.. ఒక దైర్యం. అమ్మగురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎందుకంటే ప్రపంచంలో అమ్మను మించిన యోధుడు లేడు అని అంటారు. నవమాసాలు మోసీ కనీ పెంచే తల్లి తన పిల్లలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేదు. అందుకే ఆ దేవుడు తనకు బదులుగా భూమిపై అమ్మను సృష్టించాడని అంటారు. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించింది మరేది లేదు. తనకంటే పిల్లల కోసం ఆలోచించే మాతృమూర్తి అమ్మ. పేగు బంధాన్ని రక్షించేందుకు తల్లి ఎంతవరకైనా పోరాడుతుందనే విషయం మరోసారి రుజువైంది. ఆదివారం పాడేరు ఘాట్ రోడ్డు ప్రమాదంలో ఓ తల్లి తన ప్రాణాలను అడ్డేసి మరీ తన బిడ్డను రక్షించుకుంది.
Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో నవంబర్ టికెట్ల షెడ్యూల్ విడుదల
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు 50 అడుగుల లోయలో జారిపడిన సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, మరో 35 మందికి గాయాలయ్యాయి. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా.. ఓ తల్లి తన ప్రాణాలకు తెగించి నెల రోజుల పసికందును కాపాడుకుంది. మరోసారి అమ్మప్రేమ అంటే ఏంటో నిరూపించింది. ఆ బస్సు 50 అడుగుల లోతులో పడిపోయినా సరే చంటి బిడ్డను మాత్రం ఆ తల్లి వదల్లేదు. ఆమె తలకు తీవ్ర గాయమైనా పసికందు ఒంటిపై చిన్న గీత కూడా పడనివ్వకుండా కాపాడింది ఆ తల్లి ప్రేమ. తన బిడ్డను అమ్మవారి అనుగ్రహమే కాపాడిందంటూ ఆ తల్లి వాపోయింది.