Mother Suicide in Hyderabad: ఆ బాలుడిది ఆడుతూపాడుతూ గడిపే వయసు. అంగవైకల్యం ఆ ఎనిమిదేళ్ల బాలుడి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ బాలుడి బాధను చూసి ఆ కన్న హృదయం కన్నీరుమున్నీరైంది. ఆ బాలుడి కారుణ్య మరణం కోసం దరఖాస్తు చేసుకుందామని భార్యపై బాలుడి తండ్రి ఒత్తిడి తెచ్చాడు. అంగవైకల్యంతో ఉన్న కుమారుడి మెర్సి కిల్లింగ్ కోసం ఒప్పుకోవాలని ఆమెను బాధించాడు. ఎంతైనా కన్నతల్లి కనుక ససేమిరా అంది. కానీ భర్త వేధింపులు చాలా కాలంగా ఎక్కువైంది. దీంతో కొడుకు చావును చూడలేక ముందే తనువు చాలించింది ఆ తల్లి.
భర్త వేధింపులు భరించలేక, కొడుకు చావుని చూడలేక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీలోని మంజీర ట్రినిటీ హోమ్స్ 23వ అంతస్తు నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ స్వాతి(38) ఆత్మహత్యకు పాల్పడింది. స్వాతి భర్త శ్రీధర్ కూడా సాప్ట్ వేర్ ఉద్యోగమే చేస్తున్నాడు. ఎనిమిదేళ్ల అంగవైకల్యం వున్న కుమారుడి విషయంలో స్వాతిని ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. కుమారుడి కారుణ్య మరణం కోసం దరఖాస్తు చేద్దామని భర్త, అతని బంధువులు స్వాతిని ఒత్తిడి చేశారు. ఆమె ఆ ప్రతిపాదనకు చచ్చినా ఒప్పుకోనని తేల్చిచెప్పింది. కానీ భర్త, అతని కుటుంబసభ్యులు ఎలాగైనా తన కుమారుడిని.. చంపేస్తారని స్వాతి భావించింది.
Harassment : అత్తింట్లో దించుతానని అడవిలోకి తీసుకెళ్లి.. బాలికపై ముగ్గురు అఘాయిత్యం
ఈ నేపథ్యంలో కుమారుడి కంటే తానే చనిపోవాలని అనుకుంది. ఆ బాలుడి మరణం చూడలేక ముందే ఆమె ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహం తీసుకునేందుకు కూడా భర్త శ్రీధర్, అతని కుటుంబసభ్యులు అందుబాటులో లేకుండా పోయారు. స్వాతి భర్త శ్రీధర్ , అతని కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని స్వాతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. స్వాతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
