మందేస్తూ చిందేస్తూ.. మజా చేద్దామా.. అంటూ మనుషులు పాడటం మనం చూస్తూనే ఉంటాం.. గొంతులో చుక్క పడితే అస్సలు ఎన్నో కళలు బయట పడతాయి.. అయితే మనుషులకు మాత్రమే కాదు.. కోతులు కూడా అదే విధంగా మందు తాగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. మొన్నీమధ్య ఓ కోతి మద్యం బాటిల్ ను తీసుకొని గుటగుట తాగింది… ఆ వీడియో ఇంకా కళ్ల ముందే ఉండగా.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. ఓ కోతి మందు గ్లాసును తీసుకెళ్లి పీకలదాకా తాగడమే కాదు కెమెరాకు పోజులిచ్చింది.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ షాకింగ్ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకా సాగర్ క్రాస్ రోడ్ వద్ద ఒక బెల్ట్ షాపు దగ్గర చోటుచేసుకుంది. మధ్యాహ్నం లంచ్ టైమ్ కావడంతో బెల్ట్ షాపు యజమాని షాపు బంద్ చేసి భోజనానికి ఇంటికి వెళ్ళాడు. బయట నుంచి మందు తెచ్చుకున్న కొందరు యువకులు బెల్ట్ షాపు వెనుక బల్లాలపై కూర్చుని మందు తాగుతున్నారు. ఈ క్రమంలో చెట్టు మీద కూర్చుని గమనించిన కోతి.. హఠాత్తుగా అక్కడకు వచ్చి యువకుడు తాగే మందు గ్లాస్ ను గుంజుకుని పరుగు పరుగున చెట్టు ఎక్కి కూర్చుంది.. దాహం వేసిందో లేక అలవాటు పడిందో కానీ ఒక సిప్ వేసి రుచిగా ఉండటంతో అస్సలు గ్యాప్ లేకుండా మొత్తం గ్లాస్ ను కనురెప్పపాటులో తాగేసింది..
పక్కనున్న మరో కోతికి కూడా అందకుండా మొత్తం లాగించేసింది. ఆ తర్వాత మత్తులో అటూఇటూ తూలుతూ.. ఎంజాయ్ చేసింది.సరదాగా మందు తాగుదామని కూర్చుంటే.. ఈ కోతులు ఎక్కడ దొరికాయి రా.. బాబు. మా నోటి కాడ మందు లాగేసుకున్నాయి అని యువకులు నవ్వుకుంటూ వెనుదిరిగారు.. తాగి చల్లగా చెట్టు మీద కునుకు తీసింది.. ఆ కోతి తాగుతున్న వీడియోను యువకులు వీడియో తీశారు.. సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఈ సీన్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది..