Mohsin Naqvi: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నిర్వహణను పర్యవేక్షించే ప్రధాన సంస్థ. 1909లో స్థాపితమైన ఈ సంస్థ వివిధ దేశాల క్రికెట్ బోర్డులను సమన్వయం చేస్తూ, క్రికెట్ క్రీడా అభివృద్ధికి కృషి చేస్తోంది. ప్రపంచకప్, టి20 వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రముఖ టోర్నమెంట్ల నిర్వహణ బాధ్యతను ఈ సంస్థ చేపడుతుంది. ఐసీసీ పరిధిలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) కీలకంగా వ్యవహరిస్తుంది. ACC ఆసియా ఖండంలో క్రికెట్ అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటైంది.
Read Also: Earthquake: నేపాల్‌లో 5 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)కి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వెంటనే ACC బాధ్యతలు స్వీకరించిన నఖ్వీ, తన అధ్యక్ష పదవి పై స్పందించారు. ఇందులో భాగంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కి అధ్యక్షుడిగా వ్యవహరించడం నా గౌరవంగా భావిస్తున్నానని.. క్రికెట్ అభివృద్ధి కోసం సభ్య బోర్డులతో కలిసి పనిచేసే లక్ష్యంతో ఉన్నానని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 2024లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మొహ్సిన్ నఖ్వీ, ఇప్పుడు ACCకి అధ్యక్షుడిగా రెండేళ్లపాటు కొనసాగనున్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న షమ్మీ సిల్వా స్థానాన్ని నఖ్వీ భర్తీ చేయనున్నారు. ACC మరింత బలోపేతం కావడానికి సభ్య దేశాల సమిష్టి కృషి అవసరమని నఖ్వీ స్పష్టం చేశారు. పాత అధ్యక్షుడు షమ్మీ సిల్వాకి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. జై షా నాయకత్వంలో ACC అనేక కీలక మైలురాళ్లను చేరుకుంది. ముఖ్యంగా ఆసియా కప్ వాణిజ్య హక్కులను అత్యధిక ధరకు విక్రయించడం, క్రికెట్ అభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందించడం వంటి అంశాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారని నఖ్వీ వ్యాఖ్యానించారు.