టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గత రాత్రి జరిగిన ఉత్కంఠభరితమైన ‘ క్వార్టర్ ఫైనల్’ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించి, భారత జట్టు సగర్వంగా సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ చారిత్రాత్మక విజయానికి కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ తన అసాధారణమైన బ్యాటింగ్‌తో వెన్నెముకగా నిలిచారు. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సంజూ శాంసన్ వీరవిహారంతో మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలి ఓపెనర్లు అభిషేక్ శర్మ (10) , ఇషాన్ కిషన్ (10) త్వరగానే అవుట్ అయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 97 పరుగులు చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. తన క్లాస్ మరియు మాస్ షాట్లతో ఈడెన్ గార్డెన్స్ స్టేడియాన్ని హోరెత్తించారు. సెంచరీకి కేవలం 3 పరుగుల దూరంలో నిలిచినప్పటికీ, జట్టును గెలిపించడమే లక్ష్యంగా శాంసన్ ఆడిన తీరు అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఈ విజయంతో భారత్ గ్రూప్-1 నుండి సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. ఈ చారిత్రక విజయంలో కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. సంజూ ఆడుతున్న తీరుపై కేవలం క్రికెట్ అభిమానులే కాదు, సినీ దిగ్గజాలు సైతం ముగ్ధులవుతున్నారు. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సంజూ శామ్సన్ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూ “సంజూ శామ్సన్ ఇంతటి అద్భుతమైన ఫామ్‌లో ఉండటం చూడటానికి చాలా సంతోషంగా ఉంది! ఇది నిజంగా ఒక మాస్టర్‌ఫుల్ ఇన్నింగ్స్. ఈ ఆట అతనిలోని వ్యక్తిత్వాన్ని, అద్భుతమైన ప్రతిభను చాటి చెబుతోంది,” అని మోహన్ లాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సంజూ శామ్సన్ కేవలం రన్స్ చేయడం మాత్రమే కాకుండా, క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్న తీరు అమోఘమని ఆయన ప్రశంసించారు.
Exhilarating to watch @IamSanjuSamson in such sublime form! A truly masterful innings that speaks volumes of his character and talent. Hearty congratulations to the entire Indian team for storming into the #T20WorldCup2026 Semi-Finals. Keep the flag flying high! 🇮🇳 pic.twitter.com/jLMYCQSOWc
— Mohanlal (@Mohanlal) March 1, 2026
