Mohan Bhagwat: “నేటి తరం దారి తప్పలేదు”.. సీజేపీ నిరసనల వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..

Mohan Bhagwat

Mohan Bhagwat

Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ (RSS) అధినేత మోహన్ భగవత్ నేటి యువతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి తరం మార్గదర్శకత్వం లేనిదో లేదా దారి తప్పినదో కాదని, వారిని అర్థం చేసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం కాకుండా అర్థవంతమైన చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో ఢిల్లీ వీధుల్లో విద్యార్థుల నిరసనలతో వాతావరణం అత్యంత వేడెక్కిన తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘విశ్వ మాంగల్య సభ’ కార్యక్రమంలో మాట్లాడిన మోహన్ భగవత్ తరాల మధ్య పెరుగుతున్న వ్యత్యాసాన్ని ప్రస్తావించారు. “మేము యువకులుగా ఉన్నప్పుడు విధేయత చూపించే వాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. నేటి తరం ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉంది. కాబట్టి మనం వారికి ప్రతి విషయాన్ని కారణాలతో సహా వివరించాల్సి ఉంటుంది. వారిపై ఎనలేని ప్రేమను చూపిస్తూ, వారితో సమయం గడపాలి. కుటుంబాల్లో సంభాషణలు తగ్గిపోతుండటం ఆందోళనకరం. యువత నమ్మకాన్ని గెలవాలంటే హుకుం జారీ చేయడం కాదు, వారితో మాట్లాడాలి. వారికి ఓ ఆత్మీయ భావన కలిగించాలి. ఆదేశాలు జారీ చేయడం కాకుండా చర్చలు జరిపి, ఒక ఏకాభిప్రాయానికి రావడం ముఖ్యం” అని భగవత్ పిలుపునిచ్చారు.

జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనల గురించి భగవత్ ప్రత్యక్షంగా ఎలాంటి ప్రస్తావన చేయకపోయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇతర రాష్ట్రాలకు కూడా పాకిన ఈ సీజేపీ (CJP) నిరసనలపై ఆయన ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ముఖ్యంగా జూలై 20న పార్లమెంట్ సమీపంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలు ప్రజా ఆగ్రహాన్ని మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ట్విట్టర్ (X) వేదికగా స్పందిస్తూ.. “మోహన్ భగవత్ గారు, జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న పరిణామాలపై గత నెల రోజులుగా మీరు పాటిస్తున్న మౌనం మీ ఉపన్యాసాల కంటే చాలా శక్తివంతంగా ఉంది” అని విమర్శించారు.