NTV Telugu Site icon

Mohan Babu: ప్రధానిపై మోహన్‌బాబు ప్రశంసలు.. మోడీ లేకపోతే ఈ పరిస్థితులు లేవు..!

Mohan Babu

Mohan Babu

Mohan Babu: ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు టాలీవుడ్‌ కలెక్షన్‌ కింగ్‌ మంచు మోహన్‌బాబు.. తిరుపతిలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. కోటిహనుమాన్ చాలీసా తిరుపతిలో జరగడం మనందరి అదృష్టంగా పేర్కొన్నారు. ఈ రోజు నేను ఏమి మాట్లాడినా అతిశయోక్తి కాదన్నారు. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే ఈ పరిస్థితులు లేవు అన్నారు.. కులాలు అనేవి లేవు, తెలిసో తెలియకో అజ్ఞానులు కులాల గురించి మాట్లాడుతున్నారు.. కానీ, మోడీ ఒక్కరే అందరూ కలిసుండాలని చెప్పారన్నారు మోహన్‌బాబు.

Read Also: Asaduddin Owaisi: మసీదులను రక్షించుకోవాలి.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ఎల్లప్పుడూ నరేంద్ర మోడీయే భారత ప్రధానిగా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు మోహన్‌బాబు. మోడీ ప్రధాని కాక ముందే ఆయన్ని నేను ఫ్యామిలీతో కలిశాను అనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మోడీ రెండు సార్లు విజయం సాధించారు. మళ్లీ విజయం సాధించ బోతున్నారు.. మూడో సారి ఆయన భారత ప్రధాని అవుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక, అయోధ్యలో రామమందిరం నిర్మాణం ఒక చరిత్రగా అభివర్ణించారు.. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం వచ్చిందని వెల్లడించారు మోహన్‌బాబు. కాగా, ఫ్యామిలీతో ప్రధాని నరేంద్ర మోడీని మోహన్‌బాబు కలిసిన విషయం విదితమే.. గతంలోనూ ఆయన ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించినా.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. ప్రధాని మోడీపై మోహన్‌బాబు ప్రశంసలు వెనుక ఏదైనా మతలబు ఉందా? వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారా? అనే చర్చ పొలిటికల్‌ సర్కిల్‌లో ఆసక్తికరంగా సాగుతోంది.

Show comments