Sunil Gavaskar Said Remove Workload from Indian Cricket Dictionary: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ డిక్షనరీ నుంచి ‘వర్క్‌లోడ్’ అనే పదాన్ని తీసేయండి అని డిమాండ్ చేశారు. వర్క్‌లోడ్‌లో శారీరకంగా కంటే.. మానసికంగా బలోపేతంగా ఉండటం ముఖ్యమని చెప్పారు. వర్క్‌లోడ్ అనే అపోహను పేసర్ మహ్మద్ సిరాజ్ తొలగించాడన్నారు. భారత సరిహద్దులో ఉండే జవాన్లు ఎప్పుడైనా నొప్పులు ఉన్నాయని, చలిగా ఉందని ఫిర్యాదులు చేశారా?.. మరి టీమిండియా ప్లేయర్స్ దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన చేయలేరా? సన్నీ ప్రశ్నించారు. వర్క్‌లోడ్‌లో భాగంగా జస్ప్రీత్ బుమ్రా మూడు టెస్టులే ఆడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవాస్కర్ పరోక్షంగా మండిపడ్డారు.
ఇండియా టుడేతో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘బౌలర్లు మ్యాచ్‌లు గెలిపిస్తారని అంటారు. నిజానికి బౌలర్లు కూడా పరుగులు చేస్తేనే విజయం సులువు. తొలి టెస్టులో పరుగులు చేయలేక ఓడిపోయారు. బౌలింగ్‌తోనూ అద్భుతాలు చేయొచ్చని మహ్మద్ సిరాజ్ మరోసారి నిరూపించాడు. సిరాజ్ బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. వర్క్‌లోడ్ అనే దానిని పక్కన పెట్టేసేలా బౌలింగ్ చేశాడు. వర్క్‌లోడ్ అనే పదాన్ని భారత క్రికెట్ డిక్షనరీ నుంచి తొలగించాలి. ఐదు టెస్టుల్లో 6-8 ఓవర్ల స్పెల్స్‌ను సిరాజ్ వేశాడు. కెప్టెన్ ఎప్పుడు బంతి ఇచ్చినా బౌలింగ్ చేశాడు. సిరాజ్ సూపర్. వర్క్‌లోడ్ అనేది శారీరకంగా కంటే.. మానసికంగా చాలా ముఖ్యం’ అని చెప్పారు.
Also Read: India Win: గవాస్కర్ సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అయిందిగా.. వీడియో వైరల్!
‘వర్క్‌లోడ్ విషయంలో తలొంచితే మైదానంలో అత్యుత్తమ ప్లేయర్లను దించలేం. ఈ విషయంలో కఠినంగా ఉండాలి. ”మీరు దేశం కోసం ఆడుతున్నారు. దేశం కోసం ఆడుతున్నప్పుడు నొప్పులు, బాధలలను మరచిపోవాలి. సరిహద్దులో ఉండే జవాన్లు ఇలాగే ఫిర్యాదు చేస్తారా?. ఎప్పుడైనా నొప్పులు ఉన్నాయని, చలిగా ఉందని ఫిర్యాదులు చేశారా?. ఏ పరిస్థితులైనా ఉన్నా దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతారు. అలాంటప్పుడు మీరు అత్యుత్తమ ప్రదర్శన చేయలేరా?” అని చెప్పండి. గాయాల గురించి ఆందోళన చెందొద్దు. పాదానికి ఫ్రాక్చర్ అయినా రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అందరి నుంచి జట్టు ఇదే ఆశిస్తుంది. చిన్న చిన్న గాయాలకే ఆడొద్దని అనుకోవద్దు. 140 కోట్ల భారతీయుల అంచనాలను మోస్తున్నారు, దాన్ని పెద్ద గౌరవంగా భావించాలి. సిరాజ్ వరుసగా ఐదు టెస్టులలో నాన్ స్టాప్‌గా బౌలింగ్ చేశాడు. ఎవరైనా దేశం కోసం ఉత్తమమైన ప్రదర్శన ఇవ్వాలి’ అని సన్నీ వివరించారు.