Mohammed Shami Favourite Actors are Prabhs and JR NTR: ‘బాహుబలి’ సినిమాతో టాలీవుడ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆర్ఆర్ఆర్, పుష్ప, సలార్ సినిమాల రిలీజ్ అనంతరం హాలీవుడ్ సైతం టాలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు కేజీఎఫ్-1, కాంతార, కేజీఎఫ్-2 చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం అందరి చూపు సౌత్ సినిమాలపైనే ఉంది. సౌత్ సినిమాలకు బాలీవుడ్, హాలీవుడ్ మాత్రమే కాదు.. క్రికెటర్స్ కూడా ఫిదా అవుతున్నారు. టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌లు అంటే చాలా ఇష్టమట.
శిల్పా హిల్స్‌లోని యుజెనిక్స్ హెయిర్ ట్రాన్స్‌ప్లెంట్ సెంటర్‌ను ప్రారంభించేందుకు మొహమ్మద్ షమీ హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంతో తనకున్న అనుబంధం, సౌత్ సినిమాల గురించి స్పందించాడు. ‘నేను ఖాళీ సమయంలో సౌత్ సినిమాలు బాగానే చూస్తాను. తెలుగు, తమిళం నాకు రాదు కాదు కాబట్టి.. దబ్ అయిన మూవీస్ చూస్తుంటాను. సౌత్‌లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు బాగా నటిస్తారు. క్రికెట్ ఆడే సమయంలో సినిమాల గురించి సరదాగా మాట్లాడుకుంటాం. సౌత్ హీరోల గురించి కూడా చర్చించుకుంటాం’ అని షమీ తెలిపాడు.
Also Read: Rituraj Singh Dies: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు రుతురాజ్ సింగ్ కన్నుమూత!
‘నా బయోపిక్ గురించి ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు లేవు. ఒకవేళ నా బయోపిక్ తీసినా.. ఎవరు నటిస్తే బాగుంటుందో కూడా చెప్పలేను. హైదరాబాద్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడికి వస్తే బిర్యానీ తినకుండా వెళ్లను. ఇక్కడి బిర్యానీ చాలా టేస్టిగా ఉంటుంది. నా హెయిర్ ప్లాంటేషన్ సక్సెస్ అయింది. గతంలో కంటే ఇప్పుడు జుట్టు బాగా ఉంది. చికిత్స డాక్టర్ల పర్యవేక్షణలో జరిగింది. అందుకే ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నా. నా రిజల్ట్ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మొహమ్మద్ షమీ చెప్పాడు. గాయంతో బాధపడుతున్న షమీ.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2024 లో అతడు మైదానంలోకి దిగనున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో షమీ సంచలన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.