Modi-Trump: మోడీ–ట్రంప్‌ భేటీలో ట్విస్ట్‌.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్‌, ట్రంప్‌ మాత్రం అడిగేశారు!

Modi Trump G7 Meeting

Modi Trump G7 Meeting

US Ambassador Sergio Gor: ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సమిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన భేటీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన నిజం వెలుగులోకి వచ్చింది. మోడీతో సమావేశం తర్వాత విలేకరుల ప్రశ్నలకు చోటు ఇవ్వొద్దని భారత్ స్పష్టంగా విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆ విషయాన్ని ట్రంప్ మర్చిపోవడంతో అది కాస్తా 45 నిమిషాల సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్‌గా మారిపోయింది. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ‘ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్’ వేదికగా వెల్లడించారు.

ఫ్రాన్స్‌లోని ఈవియన్-లెస్-బైన్స్‌లో జరిగిన ఈ సమావేశానికి ముందు వెనుక జరిగిన రసవత్తర డ్రామాను గోర్ గుర్తుచేసుకున్నారు. “సమావేశానికి ముందు బ్యాక్‌స్టేజ్‌లో అధ్యక్షుడితో నేను ఒక్కడినే ఉన్నాను. భారత్ వైపు నుంచి ఏమైనా విజ్ఞప్తులు ఉన్నాయా అని ఆయన నన్ను అడిగారు. మీడియాని లోపలికి అనుమతిద్దాం కానీ, పూర్తిస్థాయి ప్రెస్ కాన్ఫరెన్స్ వద్దు, ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని భారత విదేశాంగ శాఖ కోరినట్లు నేను ట్రంప్‌కు చెప్పాను. దానికి ఆయన ‘సరే, నాకేమీ అభ్యంతరం లేదు’ అని ఒప్పుకున్నారు” అని గోర్ వివరించారు. అయితే తీరా సమావేశం ప్రారంభమయ్యాక కథ వేరేలా మారింది. గదిలో దాదాపు 50 కెమెరాల మధ్య ఇద్దరు నేతలు ఎదురెదురుగా కూర్చుని ఆరంభ ఉపన్యాసాలు పూర్తి చేశారు. ఆ వెంటనే ట్రంప్ కెమెరాల వైపు చూస్తూ “ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?” అని విలేకరులను అడిగేశారు. దీంతో భారత్ వద్దు అనుకున్న పరిస్థితి ఏర్పడి, అన్ని రకాల అంశాలపై ఏకంగా 45 నిమిషాల పాటు ప్రెస్ మీట్ నడిచింది. అయితే రాయబారి చేసిన ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో, అలాగే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల నౌకాయానం ప్రభావితమవుతున్న తరుణంలో ఈ సమావేశం జరిగింది. కాగా, ఈ భేటీకి కొద్దిరోజుల ముందే హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై అమెరికా నేవీ జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. ఈ అంశాన్ని ప్రధాని మోదీ ట్రంప్ వద్ద ప్రస్తావిస్తూ, “హార్ముజ్ జలసంధిలోని భారతీయ నావికుల భద్రత మాకు అత్యంత ముఖ్యం” అని తేల్చిచెప్పారు. అయితే నౌకాయానంలో ఇలాంటి ప్రమాదాలు సాధారణమేనంటూ ట్రంప్ దాని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ భేటీలో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలతో పాటు హార్ముజ్ జలసంధి ప్రాంతంలో పరిస్థితిపై చర్చించారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామని చెప్పిన ట్రంప్, వేరే ఏదైనా దేశం భారత్‌పై దాడికి దిగితే అమెరికా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. మోడీ వైపు చూపిస్తూ “ఒకవేళ ఆ వ్యక్తిపై ఎవరైనా దాడి చేస్తే మేము అండగా ఉంటాం. అయితే కొత్త నాయకుడు వస్తే మాత్రం నేను చెప్పలేను” అని వ్యాఖ్యానించారు.