Public Examinations Act: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నుంచి పేపర్ లీక్ చేస్తే దబిడిదిబిడే..

Modi

Modi

Public Examinations Act: నీట్ (NEET) పరీక్షల లీకేజీల వ్యవహారంపై విద్యార్థుల ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజీలు, కాపీయింగ్ రాయుళ్లపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా యువతలో రేగుతున్న నిరసనల సెగను గ్రహించిన ప్రధాని నరేంద్ర మోడీ, ఈ వ్యవహారంపై ఆలస్యంగానైనా కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. అర్ధరాత్రి వేళ విడుదల చేసిన ఓ భావోద్వేగ వీడియో సందేశంలో ఆయన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అమలులో ఉన్న ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024’ చట్టానికి మరింత పదను పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

శుక్రవారం మధ్యాహ్నం జరగనున్న కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ చట్ట సవరణలకు ఆమోదముద్ర పడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపాదిత మార్పుల్లో ప్రధానంగా పేపర్ లీకేజీ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ‘ఫాస్ట్ ట్రాక్ కోర్టులను’ ఏర్పాటు చేసే నిబంధనను చేర్చనున్నారు. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ఇటువంటి కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ప్రకటించగా, దానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా, లీకేజీలకు పాల్పడే వారికి విధించే జైలు శిక్షతో పాటు భారీగా జరిమానాలను సైతం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం పేపర్ లీక్ కేసుల్లో దోషులకు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు పది లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తున్నారు. అలాగే లీకేజీల సమాచారాన్ని అధికారులకు చెప్పకుండా దాచిపెట్టే సేవా నిర్వాహకులకు కోటి రూపాయల వరకు జరిమానా విధించే వెసులుబాటు ఉంది. ఇది ఒకవేళ వ్యవస్థీకృత నేరంగా తేలితే శిక్షను 5 నుంచి 10 ఏళ్లకు పెంచడంతో పాటు కనీసం కోటి రూపాయల జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే సవరణలతో ఈ శిక్షలు మరింత కఠినతరం కానున్నాయి. క్యాబినెట్ ఆమోదం పొందిన వెంటనే, పార్లమెంట్ రెండో వారం ప్రారంభమయ్యే సోమవారం రోజే ఈ ‘సవరణ బిల్లు’ను లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది.

మరోవైపు ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. గత పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 150కి పైగా పేపర్ లీకేజీలు జరిగినా, ఒక్కరికి కూడా శిక్ష పడలేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శించారు. మోడీ వీడియో సందేశంపై స్పందిస్తూ, లీకేజీల బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని మరోసారి స్పష్టం చేశారు. అయితే ప్రధాని మోడీ మాత్రం తన వీడియోలో విద్యార్థుల ఆవేదనను ప్రస్తావిస్తూ లీకేజీ అనేది మామూలు విషయం కాదని, అది లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలకు ఎంతో గుండెకోతను మిగులుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గత రెండున్నర నెలలుగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపామని తెలిపారు. విద్యార్థుల ఒక విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడడమే తమ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కనీసం 22 లక్షల మంది విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం తన శక్తియుత్తులన్నీ ఉపయోగించిందని మోడీ వెల్లడించారు. శాఖాపరమైన ఆమోదాలు, అర్ధరాత్రి వరకు సాగిన చర్చల అనంతరం సిద్ధమైన ఈ బిల్లును క్యాబినెట్ మంత్రుల సూచనల మేరకు తుది రూపానికి తెచ్చి, సోమవారం నుంచే పార్లమెంట్‌లో ఆమోదింపజేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తామని ప్రధాని పునరుద్ఘాటించారు.