Site icon NTV Telugu

Registrations : సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆధునికత.. త్వరితగతిన రిజిస్ట్రేషన్లకు కీలక నిర్ణయం

Registrations

Registrations

Registrations : రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా సేవలు అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల ఆధునీకరణ కొనసాగుతున్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేకుండా, కేవలం 10–15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. మొదటి దశగా రాష్ట్రంలోని 144 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 22 కార్యాలయాల్లో ఈ విధానం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానుంది. హైదరాబాదులో ఆజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట వంటి ప్రాంతాల్లో ప్రారంభించనున్నారు.

ఒకేసారి ఎక్కువ దస్తావేజులు సమర్పించడం వల్ల జరిగే జాప్యాన్ని నివారించేందుకు ప్రతి కార్యాలయంలో పని వేళలను 48 స్లాట్లుగా విభజించారు. ప్రజలు registration.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని, నిర్ణీత సమయంలో హాజరై రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. అత్యవసరంగా రాబోయే వారికి ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఐదు వాక్-ఇన్ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది. స్లాట్ బుకింగ్ విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అధిక రద్దీ ఉన్న కార్యాలయాలకు అదనపు సబ్-రిజిస్ట్రార్లను నియమించనున్నట్లు మంత్రి తెలిపారు. ఉదాహరణగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్-రిజిస్ట్రార్లు నియమించబడ్డారు. తద్వారా అక్కడ 144 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. పని భారాన్ని సమతుల్యం చేయడం కోసం, అధిక రద్దీ ఉన్న మరియు తక్కువ రద్దీ ఉన్న కార్యాలయాల పరిధిని సమీక్షించి విలీనం చేస్తామని, మొదటగా చంపాపేట – సరూర్ నగర్ కార్యాలయాలను విలీనం చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

Rahul Gandhi: ‘‘భారత రాజ్యాంగం 1000 ఏళ్ల పాతది’’.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు..

Exit mobile version