ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మొక్కలు నాటారు. జూబ్లిహిల్స్ ప్రశాసన్ నగర్‌లోని జీహెచ్ఎంసీ పార్క్‌లో నిర్వహించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో తన బృందంతో కలిసి పాల్గొన్నారు. సింగర్లు అరుణ్ కౌండిన్య, అమల, మోహన, హైమత్ మహమ్మద్, గోమతి, రాహుల్ తదితరులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ‘మౌనంగానే ఎదగమని.. మొక్క నీకు చెబుతుంది’ అనే పాట పాడారు. తద్వారా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ని సంగీతమయం చేశారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ మనిషికి మొదటి గురువు నేల తల్లి అయితే రెండో గురువు చెట్టు అని చెప్పారు.
‘మనం మనుషులతోనే మాట్లాడతాం. మనుషుల్నే జీవులుగా పరిగణిస్తాం. కానీ మొక్కలు మనకన్నా గొప్పవి. ఏ స్వార్థం లేకుండా మనకోసం ప్రాణ వాయువును అందిస్తున్నాయి. మనం బతకాలంటే చెట్లు కావాలి. చెట్లు కావాలంటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటాలి. వాటిని సంరక్షించాలి’ అని పిలుపునిచ్చారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని అత్యంత ప్రేమతో కొనసాగిస్తున్న రాజ్యసభ సభ్యుడు, ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఇనీషియేటర్ సంతోష్ కుమార్‌ని మనస్ఫూర్తిగా అభినందించారు. సంగీత దర్శకుడులు మణిశర్మ, వందేమాతరం శ్రీనివాస్, ప్రముఖ గాయని సునీతకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.