MLC Jeevanreddy: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై దాడిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. అధికార పార్టీ దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తుఉండిపోవడాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. విమర్శలు చేస్తే చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి కానీ దాడులు చేయడం ఇదేం సంస్కృతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్న జీవన్ రెడ్డి… వైఎస్ విగ్రహం పునః ప్రతిష్టింపజేయడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. ఆడబిడ్డని కూడా చూడకుండా దాడి చేయడం, యాత్రను అడ్డుకోవడం ఏమిటి..? అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
Read Also: YS Vijayamma: దీక్షకు దిగిన విజయమ్మ.. నా కూతురిని నేను చూడకూడదా ఇదేం న్యాయం
అనుమతి పొందిన యాత్రకు పోలీసులు భద్రత కల్పించడం వారి బాధ్యత అని, వైఎస్ పై అభిమానంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే ధ్వంసం చేయడం ఇదేం ప్రజాస్వామ్య విధానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డ పార్టీకి అధ్యక్షురాలిగా ఉండకూడదా… భూర్జువ మనస్తత్వంతో మీకు మాత్రమే పాలించే అర్హత ఉందా అని నిలదీశారు. వైఎస్ విగ్రహం ధ్వంసం చేయడం, రైతులు, మహిళలు, విద్యార్థులు మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. ఉచిత విద్యుత్ అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ దేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. నాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ ఒక్కటి చూపించినా కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఎస్ చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కొనసాగింపు మాత్రమేనని ఉద్ఘాటించారు.