తెలంగాణలో జనాభాకి అనుగుణంగా లెక్కలు లేవని.. 4.30 కోట్లు జనాభా ఉంటే 3.70 కోట్లు మాత్రమే చూపెట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ సర్వే చేస్తే 52 శాతం బీసీ జనాభా ఉంటే.. కాంగ్రెస్ సర్వేలో 46 శాతం మాత్రమే ఉందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకూ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం 1.08 లక్షల కోట్లు ఇచ్చిందని, నిరూపిస్తాం అంటే కాంగ్రెస్ నేతలు పారిపోయారని బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
‘బీజేపీ కులగణనకి బీజేపీ వ్యతిరేకం కాదు. తెలంగాణలో జనాభాకి అనుగుణంగా లెక్కలు లేవు. 4.30 కోట్లు జనాభా ఉంటే 3.70 కోట్లు మాత్రమే చూపెట్టారు, మిగతా 60 లక్షల మంది ఎక్కడికి పోయారు?. కేసీఆర్ సర్వే చేస్తే 52 శాతం బీసీ జనాభా ఉంటే.. 46 శాతం కాంగ్రెస్ సర్వేలో ఉంది. బీసీల్లో ముస్లింలను చేర్చితే.. అసలు బీసీలకు 32 శాతమే వస్తుంది. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో అభివృద్ధి విషయంలో పోల్చుకోండి. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వమనంటే ఎందుకు ఇవ్వడం లేదు. కేసీఆర్ పేరు ఫోన్ ట్యాపింగ్లో నిందితులు చెప్పారు. ఎందుకు కేసీఆర్‌కి నోటీసులు ఇవ్వలేదు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు కాంగ్రెస్ హయాంలోనే పారిపోయారు. సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వండి.. వాళ్ళను పట్టుకోస్తాం’ అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.
‘ఫార్ములా ఈ-కార్ రెస్ కేసులో కేసీఆర్‌కి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు. ఇదేనా విచారణ పద్దతి?. విద్యుత్ కొనుగోళ్ల కేసు, కాళేశ్వరం అక్రమాలు, డ్రగ్స్ కేసులలో విచారణ ఇదేనా. హైడ్రాలో ఇళ్లను కూల్చుతున్నారు. జనవాడ ఫార్మ్ హౌస్ ఎందుకు ముట్టుకోరు?. ఒక్క కేసులో కూడా కేసీఆర్ కుటుంబానికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు. లిక్కర్ కేసులో మేము కవితను అరెస్ట్ చేసి లోపల వేశాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ కేసుల విషయంలో లాలూచీ పడ్డాయి. మూసీ ప్రక్షాళనకు 15 వేల కోట్లు అయితే 1.50 లక్షల కోట్లు అంచనాలు పెంచారు. అందుకే నిధులు ఇవ్వడం లేదు. పేదరికాన్ని బట్టి యూపీ, బీహార్‌లో నిధులు ఇస్తున్నారు. అన్నీ తెల్సి ప్రజల్లో అయోమయం సృష్టించే వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
‘అభివృద్ధి విషయంలో మేము చర్చకు సిద్ధం. కేంద్రం తెలంగాణకు 1.08 లక్షల కోట్లు ఇచ్చాం.. నిరూపిస్తాం అంటే కాంగ్రెస్ వారు పారిపోయారు. బీఆర్ఎస్ కెప్టెన్ ఫామ్‌హౌస్‌లో పండుకున్నారు. వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ లాగే.. కాంగ్రేస్ నేతలు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును 50 శాతం బీఆర్ఎస్ నాశనం చేస్తే.. మిగతా 50 శాతం కాంగ్రెస్ నాశనం చేసింది. ఫిబ్రవరిలోనే పంటలు ఎండుతున్నాయి. పక్క రాష్ట్రం కృష్ణా జలాలను దోచుకుంటుంది.. అయినా చూడనట్టు కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది. సీఎం రేవంత్ ప్రధాని పట్ల చేసిన వ్యాఖ్యలు బీసీలను కించవరచడమే. ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వడం బాధ్యత. ఎవరైనా ఇవ్వాల్సిందే. ఇచ్చిన హామీలను అసలు చేసారా?.. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి?. నిన్నటి దాకా పీసీసీ, సీఎం పదవులు రేవంత్ వద్దే ఉన్నాయి. ఒత్తిడి చేస్తే పార్టీ పదవిని వదులుకున్నారు’ అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.