తెలంగాణలో బీజేపీ నేతలకు టీఆర్‌ఎస్ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు విమర్శలకు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. అయితే.. ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ.. బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావుపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ విమర్శలు చేశారు. హరీష్ రావు ఎక్కడ సమయం దొరికితే అక్కడ కేంద్ర ప్రభుత్వంపై అబద్ధాల విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా.. తెలంగాణ ఏర్పడినప్పుడు తెలంగాణ ఆదాయం ఎంత ఇప్పుడు తెలంగాణ ఆదాయం ఎంతో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా, కేంద్ర సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు అందకుండా చేస్తున్నారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు రఘునందన్ రావు.