గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని కార్యాలయంపై జరిగిన దాడిని ఎమ్మెల్యే మద్దాలి గిరి ఖండించారు. దాడికి పాల్పడిన టీడీపీ రౌడీ మూకల్ని ప్రజలు అస్సలు క్షమించరన్నారు. బీసీ మహిళ గుంటూరులో పోటీ చేయకూడదా? అని మద్దాలి గిరి ప్రశ్నించారు. ప్రతి ఎన్నిక సందర్భంలో ఏదో ఒక దాడి చేయడం టీడీపీకి అలవాటుగా మారిందని ఎమ్మెల్యే మద్దాలి గిరి విమర్శించారు.
ఎమ్మెల్యే మద్దాలి గిరి మీడియాతో మాట్లాడుతూ… ‘టీడీపీ రౌడీ మూకల్ని ప్రజలు క్షమించరు. బీసీ మహిళ గుంటూరులో పోటీ చేయకూడదా?. అల్లరి మూకల దెబ్బకు ప్రజలు భయపడుతున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం రౌడీ మూకల ఆటలు చెల్లవు. ప్రతి ఎన్నిక సందర్భంలో ఏదో ఒక దాడి చేయడం టీడీపీకి అలవాటుగా మారింది. వైసీపీ ప్రభంజనాన్ని టీడీపీ ఓర్చుకోలేకపోతుంది’ అని అన్నారు. విద్యానగర్‌లోని మంత్రి విడదల రజిని పార్టీ ఆఫీస్పై టీడీపీ-జనసేన కార్యకర్తలు అర్ధరాత్రి రాళ్ల దాడి చేశారు. కొత్తగా నిర్మించిన ఆఫీసు దగ్గరి ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు.
Also Read: Vidadala Rajini: టీడీపీ గుండాలు ఈ దాడి చేశారు.. దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదు!
డిఎస్పీ ఉమామహేశ్వర రెడ్డి మాట్లాడుతూ… ‘నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా అన్ని ప్రాంతాలలో పోలీస్ పికేటింగ్ ఏర్పాటు చేశాం. విద్యానగర్‌లో మద్యం తాగిన కొంత మంది మంత్రి విడదల రజిని కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే ముప్పై మందిని అదుపులోకి తీసుకున్నాం. అందులో టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇంకా ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందో విచారణ చేస్తున్నాం’ అని చెప్పారు.