MLA Kethireddy Venkatarami Reddy: సీఎం కాన్వాయ్‌ను రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయడం పక్కా ప్లాన్‌తో జరిగిందని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. తుంపర్తి, మోటమర్ల వద్ద భూసేకరణ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని.. అప్పట్లో ఎకరాకు 5 లక్షల పరిహారంగా నిర్ణయించి ఆ డబ్బు కోర్టులో డిపాజిట్ చేశారన్నారు. రైతులకు ఐదు లక్షల కాదు 20 లక్షలు ఇవ్వాలని తాను పోరాడానన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులతో కలసి అధికారులందరి దగ్గరికి వెళ్ళామని చెప్పారు. ఒక్కసారి కోర్టులో డిపాజిట్ చేసిన తర్వాత పరిహారం పెంచరు.. అది చట్టమని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. రైతులకు ఐదు లక్షల పరిహారం టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిందేనన్నారు. పరిహారం పెంచడం సాధ్యం కాదని అప్పుడే రైతులకు చెప్పానని.. కానీ ఇప్పుడు సీఎంని అడ్డుకునేలా కొందరు రెచ్చగొట్టి పంపించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎవరు చేశారో అందరికీ తెలుసన్నారు. రైతులు అడ్డుకుంటారని కొందరికి ముందే తెలుసని.. ధర్మవరంలో ఏ రైతుకి అన్యాయం జరగనివ్వనన్నారు.
Read Also: Ambati Rambabu: కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యకు కారణం చంద్రబాబే..
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి జగనన్న కాలనీ వద్ద బుధవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ను కొందరు రైతులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లాలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమానికి విచ్చేసిన సీఎం తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గంలో ధర్మవరం మీదుగా వెళ్తున్న విషయం తెలుసుకున్న బాధిత రైతులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. తుంపర్తి, మోటుమర్ల గ్రామాలకు చెందిన వీరు ఒక్కసారిగా రహదారి పైకి చేరుకొని.. తమకు పరిహారం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ హఠాత్పరిణామంతో కాన్వాయ్‌లోని సెక్యూరిటీ సిబ్బంది కంగుతిన్నారు.