NTV Telugu Site icon

Andhrapradesh: అంగన్వాడీ సంఘాలతో కొలిక్కిరాని ప్రభుత్వ చర్చలు

Govt Talks With Anganwadi Workers

Govt Talks With Anganwadi Workers

Andhrapradesh: అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వ చర్చలు కొలిక్కిరాలేదు. ఈ చర్చలు విఫలమయ్యాయి. 2024 జులైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది. జీతాల పెంపుపైనే అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు పట్టుబట్టారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి జీతాలు పెంచుతాం అని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎంత పెంచుతారో చెప్పాలని అంగన్వాడీలు ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడే అంకె చెప్పటం కుదరదని సర్కారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని అంగన్వాడీలు పట్టుబట్టారు. అలా చేస్తేనే సమ్మె విరమిస్తామని తేల్చి చెప్పారు. అందుకు ప్రభుత్వం ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. దీంతో అంగన్వాడీల సమ్మె కొనసాగనుంది. ఈ చర్చల గురించి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Read Also: Penamaluru Politics: టీడీపీలోకి ఎమ్మెల్యే పార్థసారథి.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బోడే వర్గం!

అంగన్వాడీలు సమ్మె ప్రారంభం అయి నెల రోజులు అవుతుందని.. ఇప్పటి వరకు జీఓఎం మూడుసార్లు చర్చలు జరిపామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వారు పెట్టిన 11 డిమాండ్లలో 10 నెరవేరుస్తాం అని చెప్పామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేశామన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ గతంలో 50 వేలు ఉండేది.. ఇప్పుడు అంగన్వాడీల వర్కర్లకు లక్షా 20 వేలకు పెంచామని.. హెల్పర్స్‌కు 20 వేల నుంచి 50 వేలకు పెంచటానికి అంగీకరించామన్నారు. మట్టి ఖర్చుల కింద 5 వేలు ఉంటే 20 వేలు చేయాలని అడిగారని… అంగీకరించామన్నారు. 2019లో ప్రభుత్వం రాగానే జీతాలను రూ. 10, 500 ఉంటే రూ. 11,500 చేశామన్నారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం 2019 మార్చి నెలలో వాళ్ళ జీతాలు పెంచిందన్నారు. అయినా ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రాగానే పెంచామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పటికిప్పుడు పెంచటం సాధ్యం కాదని స్పష్టం చేశామన్నారు. 2024 జులైలో జీతాలు పెంచుతాం అని హామీ ఇచ్చామని సజ్జల పేర్కొన్నారు.

Read Also: TDP: చంద్రబాబు నివాసానికి కృష్ణా జిల్లా నేతలు.. టార్గెట్‌ కేశినేని నాని!

సర్వీస్ కు సంబంధించిన పలు ఇతర డిమాండ్లను పరిష్కరిస్తాం అని చెప్పామని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 2014లో అంగన్వాడీల వర్కర్ల జీతం 4,200 రూపాయలు ఉండేదన్నారు. నెల రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఎక్కడా దురుసుగా ప్రవర్తించ లేదన్నారు. ప్రభుత్వం పూర్తి సంయమనంతో ఉందని, అందరూ పద్ధతిగా ఉండాలన్నారు. చర్చించుకుని నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారని.. డ్రై రేషన్, అంగన్వాడీ కేంద్రాలు మూత బడటంతో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని సజ్జల తెలిపారు. ఈ పరిస్థితిని ఇంకా కొనసాగించలేమన్నారు. రాజకీయ పార్టీలు వెనుక ఉండి నడిపిస్తున్నా‌రన్న ఆయన.. నిన్నటి నుంచి నోటీసులు ఇవ్వటం ప్రారంభించామన్నారు. నోటీసులో ఇచ్చిన గడువు లోపు విధుల్లో చేరకపోతే కొత్త వారిని నియమించాల్సి వస్తుందన్నారు. “తెగేదాక లాగ వద్దు అని విఙప్తి చేస్తున్నాం. ఇతర పార్టీల భ్రమల్లో పడి మోసపోకండి. ఉద్యోగుల పట్ల మాకు సానుభూతి ఉన్న ప్రభుత్వం మాది. అంగన్వాడీల పట్ల మరింత ఎక్కువ సానుభూతి ఉంది. వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరండి. సమ్మె చేస్తే డిమాండ్లు నెరవేరతాయా?? అలా అయితే అందరూ సమ్మె చేస్తారు. 7 లక్షల మందికి పైగా పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా చూడాలి కదా.” అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.