వరివేస్తే ఉరి అన్నది మీరు కాదా.. అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్, కేసీఆర్ ను ప్రశ్నించారు. సన్నాల సాగు చేయాలని తర్వాత రైతుల నడ్డి విరిచింది మీరు కాదా? అని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. “రైతుబంధును మధ్యమధ్యలో ఆపింది మీరు కాదా? పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ కూడా విడుదల చేయకుండా బకాయిలు పెడ్తే, ఇప్పుడు మేము వాటిని సరిచేస్తూ, సరఫరా చేయిస్తుంటే సన్నాయి నొక్కులు నొక్కుతున్నది మీరు కాదా? పంటల భీమా ఎత్తేసి గత ఐదు సంవత్సరాలలో రైతుల నోట్లో మట్టి కొట్టింది మీరు. రైతుబంధు పేరిట అన్ని పథకాలకు తిలోదకాలు ఇచ్చింది మీరు. బీఆర్ఎస్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు నిధులు విడుదల చేయకుండా, కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా చేసి, రైతుల ఉసురు పోసుకున్నది. 2014 రుణమాఫీ నాలుగు విడుతలుగా, 2015 రుణమాఫీ సగం చేసి చేతులు దులుపుకున్నది. మీ పథకాలు అంత బాగుంటే, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు మిమ్మల్ని ఎందుకు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు.” అని మంత్రి ఉద్ఘాటించారు.
READ MORE: Bandi Sanjay: కేసీఆర్ తో కొట్లాడింది బీజేపీ.. ప్రజలు మాత్రం కాంగ్రెస్ కు ఓటేశారు
వడ్లలో 10-12 కేజీల తరుగుతీసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని మంత్రి తుమ్మల అన్నారు. ” రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కూడా పెరిగిన కరెంట్ వినియోగంకు తగ్గట్లు విద్యుత్తునుకొని పంటలను కాపాడింది మేము. ఎక్కువ పీ.పీ.సీ సెంటర్లను తెరిచి కొనుగోళ్లను ముందుగానే ఆరంభించింది మేము. రాష్ట్రమును ఆర్థికంగా దివాళాతీయించినా, రైతుబంధును పూర్తిస్థాయిలో అమలుపరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. మా ప్రభుత్వం పోయినసారి కంటే 4 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ సేకరించింది. పంటలభీమా పథకాన్ని తీసుకొస్తున్నాం. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు మొరగటం మానేసి వాళ్ళ స్థాయికి తగ్గట్టు ప్రవర్తిస్తే మంచిది. బీఆర్ఎస్ నాయకులు మొరుగుతున్నారు అంటే అవి రైతులకు వక్రీకరించడం వాళ్ళ నీత్గి మాలిన రాజకీయాలు కు నిదర్శనం. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు మాటలను వక్రీకరించి వాళ్ళ స్థాయిని దిగజార్చుకోకండి” అని ఆయన వ్యాఖ్యానించారు.