తెలంగాణలో రాజకీయ వేడెక్కింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హస్తం ఉందటూ ఓ బీజేపీ ఎంపీ విమర్శలు గుప్పించడంతో.. టీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీకి ఆగడాలను ప్రశ్నిస్తున్నారనే.. సీఎం కేసీఆర్ తనయ కవితపై పుకార్లు పుట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీఆర్‌ఎస్ నేతలు. అయితే.. ఇదిలా ఉంటే.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. పోలీసులు నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరుఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.
దీంతో.. నాంపల్లి కోర్టు అప్పటికే విధించిన రిమాండ్‌ను రద్దు చేస్తూ.. రాజాసింగ్‌ను విడుదల చేసింది. అయితే.. తాజాగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మోడీ మాటలు తప్ప దేశాభివృద్ధికి చేసిందేమి లేదంటూ విమర్శలు గుప్పించారు. ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ కేసులు. కేసీఆర్ దేశాభివృద్ధిపై ప్రశ్నిస్తే కేసులు పెడతామంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో బీజేపీ పార్టీ తప్ప ఏ పార్టీ నాయకులు ఉండొద్దా..? అని ఆయన ప్రశ్నించారు. మోడీ దోస్త్ అదానీ ఆదాయం పెరిగింది తప్ప.. పేదల ఆదాయం పెరగలేదని ఆయన అన్నారు. కేసీఆర్‌ను అడ్డుకునేందుకు కవితపై ప్లాన్ ప్రకారం ఆరోపణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసులకు భయపడం.. కచ్చితంగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తామని వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
