NTV Telugu Site icon

Thummala Nageswara Rao: గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులకు ఈ పరిస్థితి..

Thumalla

Thumalla

వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో 2020- 21 సంవత్సరము వరకు వినియోగంలో ఉన్న 25 భూసార పరీక్ష కేంద్రాలను తిరిగి రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మనిషి ఆరోగ్యాన్ని తెలుసుకోవడంలో రక్త పరీక్ష ఎలా ఉపయోగపడుతుందో.. నేల పోషక విలువలు గురించి తెలుసుకోవడానికి ‘మట్టి నమూనా పరీక్ష ’ అలా ఉపయోగపడ్తుందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఈ భూసార పరీక్ష కేంద్రాలన్నీ మూత పడే స్థితికి వచ్చాయి.. వాటిని వెంటనే పునరుద్దరింప చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాల్సివుందని ఆయన సూచించారు. నేల స్వభావం రైతుకు తెలిసినప్పుడు దానికి తగ్గ పోషకాలను, సేంద్రీయ ఎరువుల ద్వారా రసాయన ఎరువుల ద్వారా అవసరం మేరకు వాడుకొనే సౌలభ్యం రైతులకు అందుబాటులోకి తేవడం ద్వారా సాగు ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.

Read Also: Ganja Milk Shake: రూటుమార్చిన స్మగ్లర్లు.. కొత్తగా గంజాయి మిల్క్ షేక్..

ప్రస్తుతం, రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాలలో 9 ప్రాంతీయ భూసార పరీక్ష కేంద్రం ఒకటి.. మొబైల్ భూసార పరీక్షా కేంద్రం ఒకటి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయ మార్కెట్ లలో 14 భూసార పరీక్షా కేంద్రాలున్నాయి.. యాసంగి సీజన్ అయిపో వస్తున్నందున్నా.. వచ్చే వానాకాలంలోపు మట్టి నమూనాలు సేకరించి ఆయా పరీక్షా కేంద్రాల సామర్థ్యం అనుసరించి, రైతులకు మట్టి పరీక్ష చేసి ఫలితాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేసే విధంగా ప్రణాళిక చేసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించారు. అదే విధంగా కొత్త సాంకేతికతతో ఈ మధ్యకాలంలో ప్రవేశ పెట్టిన మిని సాయిల్ టెస్టింగ్ కిట్ లను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలలో కోపరేటివ్ సొసైటీల, ప్రవేట్ సంస్థల భాగస్వామ్యాంతో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి అవకాశాలను పరిశీలించవల్సిందిగా తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.