ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర అని అన్నారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మేడారం భక్తుల సౌకర్యార్థం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 75 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అధికారుల అందరు సమన్వయంతో జాతర పూర్తి చేయాలని ఆమె వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తుల ప్లాస్టిక్ వినియోగం తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. జనవరి నెల లాస్ట్ వరకు జాతర పనులు పూర్తి చేస్తామని, రాష్ట్రస్థాయిలో సీఎం డిప్యూటీ సీఎం తో జాతర పై ఒక రివ్యూ ఏర్పాటు చేస్తామన్నారు. జాతర జరుగు తేదీలతో మరొకసారి పోస్టర్లు విడుదల చేస్తామని ఆమె పేర్కొన్నారు.
అంతేకాకుండా.. ప్రజాప్రతినిధులకు మినిస్టర్లకు, విఐపి లకు ప్రత్యేక ఆహ్వానం ద్వారా ఆహ్వానిస్తామని, కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ప్రత్యేక హోదా కల్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ములుగులో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. తన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలను కాపాడుకుంటానని చెప్పారు. కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రవళిరెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి, ఉపసర్పంచ్ సదానందం పాల్గొన్నారు.