Minister Savitha: విజయవాడలోని బీసీ సంక్షేమ హాస్టల్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత. హాస్టల్‌లోని సదుపాయాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మంత్రి ఆకస్మికంగా హాస్టల్‌కు వచ్చారు. స్టోర్ రూమ్, విద్యార్థుల వసతి గదులను మంత్రి పరిశీలించారు. వంట ఒకచోట, భోజనం మరో చోట ఏర్పాటు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వంట సరుకులు, కూరగాయలు నాసిరకంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారం నాణ్యత సరిగా లేకపోవడం, డైనింగ్ హాల్లో సదుపాయాల లేమీపై సిబ్బందిని నిలదీశారు. డైనింగ్ టేబుల్, కుర్చీలు, వసతి గదుల్లో ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని విద్యార్థుల వినతిని స్వీకరించారు.
Read Also: AP News: ఏపీ గవర్నర్ సెక్రటరీగా హరి జవహర్ లాల్.. ఆర్టీసీ ఎండీగా డీజీపీకి అదనపు బాధ్యతలు
టీడీపీ బీసీ సెల్, సాధికార సమితి నేతలతో కలిసి మంత్రి ఆకస్మికంగా హాస్టల్‌ను పరిశీలించారు. రోజు ఒకేరకమైన మెనూ ఏర్పాటుపై విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో మళ్లీ విద్యార్థుల నుంచి ఫిర్యాదు వస్తే ఉపేక్షించమని మంత్రి హెచ్చరించారు. ఏ క్షణం ఎలాంటి సహాయం కావాలన్నా కాల్ చేయొచ్చని మంత్రి తన పర్సనల్ నెంబర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హాస్టల్ పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు.తినే ఆహారం కూడా బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. అన్ని బీసీ హాస్టల్స్ కి మరమ్మతులు చేస్తామని.. పిల్లలందరికీ మంచి సదుపాయాలు అందజేస్తామని మంత్రి తెలిపారు.