Peddireddy Ramachandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు ఇప్పుడు రాయలసీమ గుర్తుకు వచ్చింది.. ఈ ప్రాంతంపై చంద్రబాబుకు మమకారం లేదని విమర్శించారు. సీమలో మూడు స్థానాలు మాత్రమే ఆయనకు దక్కింది. ఇందులో ఒకటి ఆయన (చంద్రబాబు)ది.. మరోటి ఆయన బామ్మర్ది (బాలకృష్ణ)ది అని.. ఇప్పుడు సీమకు అన్యాయం అంటున్నాడని మండిపడ్డారు. రాయలసీమలో పర్యటన కాకుండా చర్చ జరిపితే బాగుంటుంది.. చంద్రబాబు, వైఎస్సార్ హయాంలో సీమకు జరిగిన న్యాయంపై చర్చకు రావాలని చాలెంజ్ చేశారు.
Read Also: TSRTC: ప్రయాణికులకు షాకిచ్చిన ఆర్టీసీ.. పెరిగిన డే పాస్ ధరలు..
కనీసం కుప్పంకు కూడా నీళ్లు ఇవ్వని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి.. సొంత జిల్లా, సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు.. త్వరలో కుప్పంకు హంద్రీ – నీవా జలాలు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. సీమకు మేలు చేసే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. దీనిని సీఎం వైఎస్ జగన్.. 80 వేల క్యూసెక్కుల పెంచనున్నారని వెల్లడించారు. సీమలో ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ చంద్రబాబుకు కనపడదు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన మనుషులతో కోర్టులో కేసులు వేసి కొన్ని ప్రాజెక్ట్ పనులు నిలిపే ఆలోచనలో ఉన్నాడని ఆరోపించారు. చంద్రబాబు ముందుగా చర్చకు రావాలి.. ఆ తర్వాత ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లాలని సూచించారు. కుప్పంలో సైతం ఆయనతో చర్చకు సిద్ధమని ప్రకటించారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనను అడ్డుకోబోమని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ఆగిన మూడు ప్రాజెక్టులపై సుప్రీం కోర్టుకు వెళ్లామని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.