NTV Telugu Site icon

Minister Peddireddy: ఇలాంటి దైర్యం చంద్రబాబు నాయుడు చేయగలరా…!

Minister Peddireddy

Minister Peddireddy

Minister Peddireddy Ramachandra Reddy: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో కార్యకర్తలు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ పాల్గొన్నారు. ‘సిద్ధం’ పోస్టర్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రతి మండలానికి వందల కోట్ల రూపాయలు పథకాల ద్వారా లబ్ధి జరిగిందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హంద్రీనీవా పూర్తి చేసి వీలైనంత త్వరగా అన్ని ప్రాంతాలకు నీరు అందిస్తామన్నారు.

చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలకు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ దిన కూలి అయినా ఈరలక్కప్పకు సీఎం జగన్ మడకశిర టికెట్ ఇచ్చారని.. ఇలాంటి దైర్యం చంద్రబాబు నాయుడు చేయగలరా అంటూ సవాల్ విసిరారు. ఏ పార్టీ డబ్బు ఉన్నవాళ్ళకి టికెట్ ఇస్తుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. 99.5 శాతం ఎన్నికల హామీలు అమలు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని ఆయన తెలిపారు. గతంలో జన్మభూమి కమిటీలు వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చేవారని ఆయన విమర్శించారు. రానున్న ఎన్నికల్లో భారీ విజయంతో జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Read Also: CEO Review: ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ఓటర్ల జాబితాపై ఏపీ సీఈవో సమీక్ష

రఘువీరారెడ్డికి మంత్రి సవాల్..
అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుడిబండ మండలంలో పర్యటించారు. నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప ఇంటికి మంత్రి వెళ్లారు. ప్రజాబలంతోనే నిరుపేద అయిన ఈరలక్కప్పకు టికెట్ ఇచ్చామని ఆయన అన్నారు. పేదవాడిని శాసనసభ్యుడిగా చేసి చూపిస్తామని, ఇలాంటి అభ్యర్దిని పెట్టే సాహసం చంద్రబాబు చేయగలరా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు టిక్కెట్లు అమ్ముకుంటున్న విషయాన్ని కేశినేని నాని కూడా బయటపెట్టారన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మడకశిర ప్రాంతంలో పర్యటిస్తారని అంటున్నారని… కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లేదు… ఈసారి కూడా ఒక్క సీటు వచ్చే పరిస్థితి ఆ పార్టీకి లేదన్నారు. సీఎంను అకారణంగా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. షర్మిలను చంద్రబాబు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రఘువీరా రెడ్డి రాజశేఖర్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తారని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రఘువీరాకు అనేక పదవులు ఇచ్చి ప్రోత్సహించారని ఈ సందర్భంగా చెప్పారు. ఆయన మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి వద్ద చేరి, ఎలా దోచుకున్నారో ప్రజలందరూ చూశారన్నారు. కొంతమందిని కలిసి రఘువీరా రెడ్డి వారిని మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. మడకశిర ఎస్సీ నుంచి 2029లో జనరల్ అవుతుందని… ఆ సీటు ఇస్తామని చెప్తున్నారని తెలిసిందన్నారు. ఒకవేళ అదే జరిగితే ఆ సీటు నుంచి ఆయన కుటుంబసభ్యులే పోటీ చేస్తారన్నారు.
రాజకీయాలు చేసే రఘువీరారెడ్డికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే దైర్యం ఉందా అంటూ మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు.