NTV Telugu Site icon

Minister Rama Naidu: అంబటి రాంబాబుకు మంత్రి నిమ్మల స్ట్రాంగ్ కౌంటర్

Nimmala

Nimmala

Minister Rama Naidu: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ట్విట్టర్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అబద్దాలు ఆడడంలో అంబటిది అందె వేసిన చెయ్యి అని.. ప్రాజెక్టు ఎత్తు తగ్గించినట్లు ఆధారాలు ఉంటే చూపాలన్నారు. నిద్రపోయే వాణ్ణి లేపవచ్చని.. నిద్ర నటించే వాణ్ణి ఎవరు లేపగలరని అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అలాగే అంబటికి అన్నీ తెలుసు అని, అయినా వాళ్ల పార్టీ అధినేత మెప్పుకోసం ఆయన చెప్పిన అబద్ధాలనే ఈయన పదేపదే చెబుతున్నారని విమర్శించారు.

Read Also: AP CM Chandrababu: అన్నీ ప్రజల ముందు పెడతా.. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సీఎం కీలక వ్యాఖ్యలు

పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు అసలు మీకు ఎవరు చెప్పారు.. ఎప్పుడు చెప్పారు మీ దగ్గర ఆధారాలు ఉంటే బహిర్గతపరచాలన్నారు. మాకు తెలియకుండా మీ వైయస్సార్ పార్టీకి, నేతలకు మాత్రమే పంపారా అంటూ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లకు పెంచి పూర్తి చేస్తామని తాను చెబితే సరిపోదా అని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర జల శక్తి మంత్రితో చెప్పించాలని అనడానికి మీకు అసలు సిగ్గుందా అంటూ మండిపడ్డారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ రెండు కూడా ఎన్డీఏ ప్రభుత్వాలే.. మాది డబుల్ ఇంజన్ సర్కార్.. ఆ విషయం గుర్తెరిగి మాట్లాడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ఒకటే మాట, ఒకటే బాట అని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబుకు పోలవరం, అమరావతి రెండూ, రెండు కళ్ళు అని అన్నారు. ప్రగతి, సంక్షేమం ఆయనకు సమప్రాధాన్యం అని.. అందువల్ల పోలవరాన్ని సాంకేతిక సలహా మేరకు ముందుకు తీసుకువెళతామన్నారు. పోలవరం ప్రాజెక్టుపై మాకు 100కు 150 శాతం చిత్తశుద్ధి ఉందని.. పోలవరం ఆవశ్యకత మీకంటే మాకు బాగా తెలుసన్నారు.

ప్రాజెక్టు ఎత్తుని 41.15 మీటర్లకు కుదించేలా చంద్రబాబు కేంద్రంతో రహస్య ఒప్పందం చేసుకుని ఆ విషయం గోప్యంగా ఉంచినట్టు అంబటి ఆరోపించడం చూస్తే ఆయన మానసిక పరిస్థితి మీద డౌట్ వస్తుందన్నారు. అక్టోబర్ 9న ఇచ్చిన రూ.2348 కోట్లు మళ్ళించామనడం ఇదొక తప్పుడు ఆరోపణ అని.. నిరూపించే దమ్ముందా మీకుందా అంటూ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత సాంకేతిక ప్రమాణాల మేరకు నిర్మించి తీరుతామన్నారు. ఆంధ్రుల అభిమానాన్ని శాశ్వతంగా చూరగొంటామని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామన్నారు. అబద్ధాలు మానేయాలని, డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Show comments