Minister Nimmala Rama Naidu: ఆరేళ్ల అనంతరం నిర్వహించిన సాగు నీటి సంఘాల ఎన్నికల్లో అన్నదాతలకు అఖండ విజయం చేకూరిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కూటమిలోని అన్ని పార్టీల ఐక్యతకు అన్నదాతలు ఏకపక్షంగా మద్దతు పలికారని ఆయన వెల్లడించారు. ఐదేళ్లపాటు నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డికి, అతని పార్టీకి ఈ ఎన్నికలు ఒక చెంపపెట్టు అంటూ వ్యాఖ్యానించారు. గత ఐదు సంవత్సరాల రైతు వ్యతిరేక పాలనతో రైతులు విసుగెత్తిపోయారన్నారు.
Read Also: Minister Nadendla Manohar: సంక్రాంతి తర్వాత రోడ్ల నిర్మాణాలు ప్రారంభం
జగన్ పార్టీ తరపున నామినేషన్ వేయడానికి గానీ, బలపరచడానికి గానీ ఒక్క రైతూ ముందుకు రాకపోవడంతో తోకముడిచారని ఎద్దేవా చేశారు. సాగునీటి సంఘాల ద్వారా రైతులకు, రైతుబిడ్డలే సేవ చేసుకునేలా దాదాపు 60 వేల మందికి సాగు నీటిరంగంలో ప్రాతినిధ్యం కల్పించామన్నారు. సాగునీటి పారుదల వ్యవస్థ మరింత బలపడటానికి ఈ అన్నదాతలు ఎంతో దోహదపడతారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతిగా నిరూపించుకుందన్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో 93శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిస్తే, ఇప్పుడు సాగు నీటిసంఘాల ఎన్నికల్లో 100శాతం స్ట్రైక్ రేట్‌తో ఏకగ్రీవంగా విజయం అప్పగించారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నా కూడా ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగడం, కూటమి అభ్యర్థులకు ఇంత భారీ విజయాన్ని అందించడం.. అంటే ఇది అన్నదాతల విషయంలో ఆల్ టైం రికార్డ్ అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. అన్నదాతల అండదండలన్నీ కూటమి ప్రభుత్వానికే ఉందని మరో సారి రుజువైందన్నారు.