Minister Narayana: ఏపీలో తుఫాన్ పరిస్థితులపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, శ్రీ సత్య సాయి జిల్లాల్లో తుపాన్ ప్రభావం ఉంటుందని సమాచారం వచ్చిందన్నారు. చెన్నై- నెల్లూరు మధ్య ఈ నెల 17న తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. దీంతో ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. తుఫాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సంబంధిత అధికారులతో చర్చించారన్నారు. ఆయా మున్సిపాలిటీలలో తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ అధికారులు, ఇంజనీర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు ఇచ్చామన్నారు. వర్షపు నీరు సజావుగా వెళ్లేందుకు కాలువలను శుభ్రం చేయాలని ఆదేశించామన్నారు.
Read Also: AP Liquor Shops Lottery: లక్కంటే ఆయనదే.. మద్యం షాపుల లాటరీలో ఒకే వ్యక్తికి ఐదు దుకాణాలు!
బుడమేరుకు వచ్చిన వరదలతో ఎన్నో అనుభవాలు వచ్చాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికను రూపొందించామన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. నిత్యావసరాలను ముందు జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలని చెప్పామన్నారు. అవసరమైతే తుపాన్ ప్రభావం లేని మునిసిపాలిటీల నుంచి సిబ్బందిని పిలిపిస్తామని మంత్రి తెలిపారు. విజయవాడలో కూడా ఇదే విధానాన్ని అనుసరించామన్నారు. సిబ్బందితో ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేశామని.. అందువల్లే అంటువ్యాధులు రాలేదని మంత్రి స్పష్టం చేశారు. తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కలెక్టర్లు, సంబంధిత అధికారులు ఖాళీ చేయాలని చెబితే వెంటనే తరలివెళ్లాలని ప్రజలకు సూచించారు. అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని ప్రజలను కోరుతున్నామన్నారు. తుఫాన్ వల్ల వీలైనంత తక్కువ నష్టం కలిగేలా చూస్తామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూడా సిద్ధం చేశామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.