ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామన్నారు. స్పీకర్‌పై తప్పుడు రాతలు బాధాకరమన్నారు. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారని, ప్రజాప్రతినిధులుగా ప్రజలు తరపున పోరాడాల్సి ఉందన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ఇది కరెక్టు కాదని, చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. బుధవారం అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు.
‘చట్టసభలు చూస్తూ పెరిగా. చిన్నవయసులో చట్టసభలను చూశాను. అప్పట్లో వ్యక్తిగత దూషణలు ఉండేవి కావు, ప్రజలకు ఏమి కావాలో దానిపైనే చర్చలు జరిగేవి. చట్టసభల్లో ఇది నాకు రెండో అవకాశం. తొలిసారి శాసనసభకు వచ్చా. ఇటీవల ప్రతిపక్ష సభ్యులు బాధ్యత లేకుండా గవర్నర్ స్పీచ్‌ను డిస్ట్రబ్ చేసి వెళ్లారు. గతంలో మేం నిరసన తెలియజేసినపుడు బెంచిల వద్దే ఉండి ధర్నా చేశాం. పోడియం వద్దకు రాలేదు, మేం ఎప్పుడూ లక్ష్మణరేఖ దాటలేదు. నేను అసెంబ్లీలో కొత్త మెంబర్. పార్లమెంటులోని 121సి నిబంధన ప్రకారం ప్రతిపక్ష హోదాకు టోటల్ నెం.లో 1/10 ఉండాలని స్పష్టంగా ఉంది. అసెంబ్లీ కండీషన్స్ ఫర్ రికగ్నిషన్లో కూడా ఈ విషయం పొందుపర్చబడి ఉంది’ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
‘అప్పట్లో చంద్రబాబుకు 23 మంది సభ్యులు ఉన్నారు. ఐదుగురిని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష స్టేటస్ కూడా ఉండదు అని సభ సాక్షిగా వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. స్పీకర్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం హౌస్ పరువు తగ్గిస్తుంది. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాప్రతినిధులుగా ప్రజలు తరపున పోరాడాల్సి ఉంది. జగన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చాం. ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదు. చట్టాన్ని ఉల్లంఘించడం, దానిని హౌస్ పైన రుద్దడం బాధాకరం. ఎవరు అధికారంలో ఉన్నా ఇది కరెక్టు కాదు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుంది’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.