NTV Telugu Site icon

Minister Merugu Nagarjuna: టీడీపీ, జనసేన ఏకమైనా.. బీజేపీ కలిసినా.. అధికారంలోకి వచ్చేది మేమే..

Merugu Nagarjuna

Merugu Nagarjuna

Minister Merugu Nagarjuna: తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఏకమైనా.. బీజేపీ వారితో కలిసినా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి మేరుగు నాగార్జున.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన దూకుడు గాళ్లు సీఎం రమేష్, సుజనా చౌదరి ఇచ్చిన స్క్రిప్ట్ ను బీజేపీ నేతలు చదువుతున్నారని.. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన విభజన హామీ చట్టం గురించి మాట్లాడలేదు, మేం మొదటినుంచి పోరాటం చేస్తున్న ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని మండిపడ్డారు.. ఇక, త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Read Also: Cyclone Biparjoy: భీకర తుఫానులో కోస్ట్‌గార్డ్ సాహసం.. సముద్రం నుంచి 50 మంది రెస్క్యూ..

ఎన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే.. మరోసారి సీఎం జగన్‌ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి నాగార్జున.. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్న ఆయన.. వారాహి యాత్ర కాదది.. నారాహి యాత్ర అంటూ సెటైర్లు వేశారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి మేరుగు నాగార్జున. కాగా, వరుసగా ఏపీలో పర్యటించిన జేపీ నడ్డా, అమిత్‌షా.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేసిన ఆరోపణలు గుప్పించిన విషయం విదితమే.. దీంతో.. ఏపీలో వైసీపీ వర్సెస్‌ బీజేపీ నేతలుగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు వైసీపీ, బీజేపీ నేతలు.