NTV Telugu Site icon

Mandipalli Ramprasad: అధికారులపై మంత్రి ఫైర్.. రవాణా శాఖలో ప్రక్షాళనకు ఆదేశం

Mandipalli Ramprasad

Mandipalli Ramprasad

రవాణా శాఖలో ప్రక్షాళనకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రవాణాశాఖ లో కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా శాఖలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. గత ఐదేళ్లలో చౌకబియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలివెళ్లాయని మండిపడ్డారు. అక్రమంగా వెళ్తున్న వాహనాలను పట్టుకోకపోవడమేంటని ఆర్టీఎ అధికారులను ప్రశ్నించారు. గతంలో రాష్ట్రంలో అక్రమంగా ఇసుక , ఖనిజాలు తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయకపోవడంపై ఆరా తీశారు. అక్రమంగా ఇసుక, మైన్స్ తరలింపు వాహనాలపై తప్పక చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

READ MORE: Minister TG Bharath: త్వరలోనే ఓర్వకల్లు అతిపెద్ద పారిశ్రామిక హబ్గా ఏర్పడుతుంది..

రాష్ట్రంలో ఒకే నెంబర్ తో పలు వాహనాలు తిరుగుతున్నాయని, వాటిని పట్టుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. నిరంతరం తనిఖీలు చేసి అక్రమ రవాణా చేస్తోన్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీఏ అధికారులకు సూచించారు. గత ఐదేళ్లలో రవాణా శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం సమూల ప్రక్షాళన చేస్తుందని తెలిపారు. రవాణాశాఖలో అవినీతి, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ఒవర్ లోడ్ , ఫిట్ నెస్ లేకుండా, తిరుగుతోన్న వాహనాలపై తనిఖీలు చేసి జప్తు చేయాలని ఆదేశించారు. అక్రమార్కుల పనిపట్టి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైకాపా పాలనలో ఆర్టీసీ లో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై అధికారులను ఆరా తీశారు.

READ MORE:Duvvada Haindavi: మా డాడీ మాకు కావాలి..

2019-24 మధ్య వైకాపా ప్రభుత్వంలో ఆర్టీసీ నిర్వీర్యమైన తీరును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుసుకున్నారు. ఉద్యోగులకు గత ప్రభుత్వం చెల్లించని బకాయిలు, సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. అమరావతి బ్రాండ్ ఎసీ బస్సులను పూర్వవైభవం తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగులకు వస్తోన్న ఆరోగ్య సమస్యలు , కల్పిస్తోన్న సదుపాయాలపై ఆరా తీశారు. ఆర్టీసీ లో డ్రైవర్, కండక్టర్లు, సిబ్బంది కొరత ను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో , బస్టాండ్ల లో పరిశుభ్రతను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలివ్వాలని మంత్రి ఆదేశించారు. కారుణ్య నియామకాల్లో జాప్యాన్ని నివారించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్బన ఉద్గారాలను నివారించేందుకు ఎలక్ట్రికల్ వాహనాలను త్వరితగతిన అందుబాటులో తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.