తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని ఆయన అన్నారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన భద్రాకాళి అమ్మవారిని దర్శించుకున్న తరువాత తారా గార్డెన్ లో కార్మిక సంఘాల సదస్సులో పాల్గొని.. కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమయంలో దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్రపై కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఇప్పటికే దివాళా తీసింది..ఇక బీజేపీ దివాళా తీయబోతోందని ఆయన విమర్శించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారని అన్నారు.
వచ్చే ఎన్నికల తరువాత దేశంలో కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని అన్నారు. కేసీఆర్ దేశ్ కీ నేత అని అన్నారు. దేశంలో కేసీఆర్ పాగా వేస్తారని అన్నారు. రాబోయే ప్రభుత్వం కొత్త పార్టీ కేసీఆర్ ప్రభుత్వమే అని అన్నారు. దసరా నాడు వరంగల్ భద్రకాళి ఆలయం నుంచి దర్శనం చేసుకుని కేసీఆర్ దేశ రాజకీయాలకు బయలుదేరుతారని మల్లారెడ్డి అన్నారు. కార్మికులారా మీరు గొప్పుళ్లు కావాలంటే, మీ పిల్లలు ధనవంతులు కావాలంటే కేసీఆర్ కు సపోర్ట్ ఇవ్వాలని కోరారు. ఆయనకు సపోర్ట్ ఇచ్చి దేశానికి పంపిస్తే మనం అన్ని ఛార్జీలను తగ్గించుకోవచ్చని, మనం అన్నింటిని ఫ్రీగా చేసుకోవచ్చని అన్నారు.
అంతకుముందు భద్రాకాళి ఆలయాన్ని సందర్శించారు మంత్రి మల్లారెడ్డి. ఉదయం హనుమకొండ చేరుకున్న ఆయన, భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమకొండలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్ నిర్వహిస్తున్న కార్మిక మాసోత్సవాలలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించు కోవడం సంతోషంగా ఉందని, తెలంగాణలోని దేవాలయాలతో పాటు, కుల మతాలకు అతీతంగా అందరి అభివృద్ధి కోసం కేసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.