తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతుంది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కేసీఆర్ తో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా అభ్యర్థులంతా ప్రచారంలో ముందుకు కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని గులాబీ పార్టీ ఉవ్విళ్లూరుతుంది. ఈ క్రమంలోనే ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ మరింత ముమ్మరం చేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక, రోడ్ షోలతో ప్రజల దగ్గరకు వెళ్లి తొమ్మిదన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు.
Read Also: Rohit Sharma: బాప్రే.. ఆ ఇద్దరు భయపెట్టారు: రోహిత్
ఇక, ఇందులో భాగంగానే నేడు మంత్రి కేటీఆర్ వికారాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే, ఇప్పటికే నిర్వహించిన రోడ్ షోలలో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఓవైపు ఎన్నికల ప్రచారంలో.. మరోవైపు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీతో పాటు రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో అధికారం లేక ఆగమైన కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసేందుకు కొత్త హామీలతో ముందుకు వస్తోందని ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. హస్తం పార్టీకి అధికారం కట్టబెడితే భస్మాసుర హస్తమేనని మంత్రి కేటీఆర్ ప్రజలకు చెబుతున్నారు.
Read Also: CM KCR: నేడు ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్, నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ పర్యటన
అయితే, మంత్రి కేటీఆర్ వికారాబాద్ జిల్లాలో రోడ్ షో వివరాలు ఇవే.. ఉదయం 11 గంటలకు చేవెళ్ల నియోజక వర్గంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సపోర్టుగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వికారాబాద్ టౌన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కోసం కేటీఆర్ రోడ్ షో చేస్తున్నారు.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు మర్పల్లి మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో చేయనున్నారు.