వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుపై మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. ఈ కేసులో పేర్ని నానికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్న అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. విచారణలో భాగంగా అధికారుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ బియ్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తానన్నారు. తప్పు చేసి డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా? అని మంత్రి ప్రశ్నించారు. పదేపదే నీతి వ్యాఖ్యలు చెప్పే పేర్ని నాని.. ఇపుడు ఎక్కడ ఉన్నాడు? అని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… ‘పేదల బియ్యం కొట్టేసిన పేర్ని నానిని పంది కొక్కులా చూడాలి. నీతులు చెప్పే నాని ఇప్పుడు అడ్రస్ లేరు. దొంగ పనులు చేసి.. నిత్యం నీతులు చెప్పేవారు. తప్పు చేసి డబ్బులు కడితే దొర అవుతాడా?. పదేపదే నీతి వ్యాఖ్యలు చెప్పే నాని.. ఇపుడు ఎక్కడ ఉన్నారు?. పేర్ని నాని కుటుంబం స్కాం చేసింది వాస్తవం, అది స్వయానా నాని ఒప్పుకున్నారు. దారి మళ్లిన పీడీఎస్ రైస్ స్కాంపై వివరణ ఇచ్చుకోలేని దుస్థితిలో నాని ఉన్నారు. తప్పు చేయనపుడు దొంగలా తప్పించుకొని తిరగడం ఎందుకు?’ అని ప్రశ్నించారు.
Also Read: Prakasam Earthquakes: ప్రకాశం జిల్లాలో వరుసగా మూడోరోజు భూప్రకంపనలు!
‘తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. స్కాంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తాను. విచారణలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. కక్ష సాధింపు చేయాల్సిన మాకు అవసరం లేదు. కక్ష సాధింపు చేస్తే స్కాంలో ఉన్న పేర్ని నాని కుటుంభం మొత్తాన్ని జైలుకు పంపేవాళ్లం. కానీ మేము అలా చేయలేదు’ అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణలు ఉన్నాయి. 32,00 బస్తాల రేషన్ బియ్యం తగ్గినట్టు అధికారులకు నాని లేఖ రాయగా.. అధికారుల పరిశీలనలో 3,708 బస్తాలు తగ్గినట్టు తేలింది. బియ్యం తగ్గడంపై 2 దఫాలుగా రూ.1.70 కోట్లు పేర్ని నాని చెల్లించారు. గోదాములు నాని భార్య జయసుధ పేరుతో ఉండటంతో పోలీసులు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.