NTV Telugu Site icon

Harish Rao: ఓటమి తప్పదు.. అందుకే అమిత్ షా ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడారు..

Harish Rao

Harish Rao

Harish Rao: ఖమ్మం జిల్లా కల్లూరులో బీఅర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వైద్య,ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రసంగించారు. బీజేపీ వాళ్లు తెలంగాణలో గెలుస్తాం అని మాట్లాడుతున్నారని.. కానీ ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కాదు కదా.. డిపాజిట్ కూడా రాదన్నారు. జిల్లాలో డిపాజిట్ రాని పార్టీ రాష్ట్రం లో అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు. అబద్ధాలు దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రమాదం ఉందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పారన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 14 లక్షల నుండి 56 లక్షల ఎకరాలకు వరి సాగు పెరిగిందని మంత్రి తెలిపారు. ఇంత పంటకు కారణం అల్లావుద్దీన్ మ్యాజిక్ కాదు.. 24 గంటల కరెంట్,రైతు భీమా,సాగు నీరు అందించటమే కారణమన్నారు.

ఒకనాడు తెలంగాణ కరువు కాటకాలకు నిలయమన్న మంత్రి.. కరువు అనే పదాన్ని డిక్షనరీలో తొలగించిన నాయకుడు కేసీఆర్ అంటూ చెప్పుకొచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం అయితే గోదాంలు పెట్టి ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. పండిన పంట కొంటాం, నష్టపోయిన రైతులను కాపాడుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. వరి పంట వేయ్యొద్దంటు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని.. కానీ తెలంగాణలో 7100 ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక భూమికి విలువ పెరిగిందన్నారు. రాష్ట్రం మొత్తం ఆయిల్ ఫాంను విస్తరిస్తున్నామన్నారు. తెలంగాణలో బీజేపీ రాదని, కర్ణాటకలో ఓటమి తప్పదని అమిత్ షా మాటలతో అర్థం అయ్యిందని.. అందుకే అమిత్‌ షా ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడాడని మంత్రి హరీశ్ రావు అన్నారు. అమిత్ షా దెయ్యాలు వేదాలు వల్లించునట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

Read Also: YS Sharmila: పోలీసులతో వైఎస్‌ షర్మిల దురుసు ప్రవర్తన.. వీడియో ఇదిగో..

పేపర్‌ లీకేజీలో ఉన్న దొంగలను, బెయిల్‌ మీద వచ్చిన వాళ్లను పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నారన్నారు. హామీ ఇవ్వకుండా ఎన్నెన్నో పథకాలు కేసీఆర్ తీసుకువచ్చారని ఈ సందర్భంగా హరీశ్ రావు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటే లంచాలు, అవినీతి,పదవులు కోసం ఆలోచించే పార్టీ అని.. ప్రజలే హైకమాండ్‌గా పనిచేసే పార్టీ బీఅర్ఎస్ పార్టీ అని మంత్రి తెలిపారు. ఢిల్లీ పెద్దలకు గులాంగా పని చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ.. గుజరాత్ పెద్దలకు గులాంగా పని చేసే పార్టీ బీజేపీ పార్టీ అని మంత్రి విమర్శించారు. 1 కోటి 17 లక్షల మందికి కంటి పరీక్షలు చేసి 30 లక్షల మంది కళ్లద్దాలు ఇచ్చామన్నారు. తండ్రిలా ఆలోచిస్తూ కంటి వెలుగు కార్యక్రమాన్ని కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఏ ఊరికి వెళ్ళినా ప్రతి రోజు నీళ్ళు వస్తాయని.. కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా.. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ బాగుందా చర్చ పెట్టాలన్నారు. ఎవడు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. పేదలకు వైద్య,విద్యను తీసుకు వచ్చిన వ్యక్తి కేసీఆర్ అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. సీతారామ నీళ్లను జిల్లాలోని ప్రతి గ్రామానికి తీసుకువస్తామని మంత్రి హరీశ్ హామీ ఇచ్చారు. కాలంతో పని లేకుండా సీతారామ ప్రాజెక్ట్ నీళ్లతో సాగు నీరు అందిస్తామన్నారు. మూడు,నాలుగు నెలల్లో సీతారామ ప్రాజెక్ట్ నీళ్లతో రైతుల కాళ్ళు కడుగుతామన్నారు. అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్ నేతలకు సూచించారు.

Show comments