NTV Telugu Site icon

Ambati Rambabu: టీడీపీ అలసత్వం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నష్టం

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: మిచౌంగ్ తుఫాన్ కొన్ని జిల్లాలను అతలాకుతలం చేసిందని ఏపీ ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తుఫాన్‌ వస్తుందనే సమాచారంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని.. దీని వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగిందని మంత్రి తెలిపారు. ఈ సంక్షోభం నుంచి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారని.. జగన్‌పై బురద చల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. బురద అంటకుండా, చొక్కా నలక్కుండా తుపాను బాధితులను పరామర్శించారని అంటున్నారని చెప్పారు. తుపాను బాధితులను పరామర్శించడానికి వెళితే బురదలో పొర్లాడాలా అంటూ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు లాగా షో చేయటం జగన్‌కు రాదని ఆయన అన్నారు. కొత్త ప్రాజెక్టులు రాష్ట్రంలో కట్టింది ఎవరు.. వైఎస్ రాజశేఖరరెడ్డి కాదా అంటూ మంత్రి ప్రశ్నించారు. జగన్ అవుకు 2వ టన్నెల్ నుంచి నీళ్ళు విడుదల చేశారని చెప్పారు. శంఖుస్థాపనలు చేసింది రాజశేఖరరెడ్డి అని.. ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి ఇవాళ జగన్ ప్రారంభిస్తున్నారన్నారు. టీడీపీ నిర్లక్ష్యం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టు కు నష్టం జరిగిందన్నారు. డ్యాం సేఫ్టీకి సంబంధించిన కమిటీలు టీడీపీ హయాంలో పరిశీలించి నివేదిక ఇచ్చాయని.. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లను రిపేర్ చేయాలని చెప్పారని.. చంద్రబాబు 5 కోట్లు ఖర్చు పెట్టి గేట్లు రిపేర్ చేయకుండా రంగులు, బ్యూటిఫికేషన్ వంటి పనులు చేశారని ఆయన ఆరోపించారు. రిపేర్లకు ఇప్పటికే టెండర్లను పిలిచామన్నారు.

Read Also: Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి శ్రీకారం

మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. “చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అతిథుల్లా వస్తుంటారు. ఇక్కడ దూషించి ప్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళుతుంటారు. చంద్రబాబు చేతిలో పచ్చ జెండా లేదు. తెలంగాణలో కాంగ్రెస్ కు ఇచ్చాడు. ఈయన జెండాలు పట్టుకుని తిరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. మన ప్రబుద్ధుడు పవన్ కళ్యాణ్‌ తెలంగాణలో 8 చోట్ల పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాలేదు. మూడు వాస్తవాలను పవన్ కళ్యాణ్ గమనించాలని విఙప్తి చేస్తున్నాను. చంద్రబాబు ముష్టి వేసినట్లు నీకు సీట్లు ఇస్తాడు. జనసేన కు అభ్యర్థులు లేని చోట్ల టీడీపీ వారినే జనసేన కండువా కప్పుతారు. రాయలసీమలో బంగాళదుంప, ఉల్లిగడ్డలు, ఎర్రగడ్డలు ప్రమాదకరం కాదు.. చంద్రబాబు లాంటి క్యాన్సర్ గడ్డలే ప్రమాదం. తెలంగాణలో కలవని టీడీపీ, జనసేన ఇక్కడ ఎందుకు కలుస్తున్నారో చెప్పాలి. ఎవరు క్యాష్ ఇస్తే పవన్ కళ్యాణ్ వాళ్ళకే కాల్ షీట్స్ ఇస్తాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ది అపవిత్ర కలయిక. అపవిత్ర కలయికను ప్రజలు తిరస్కరిస్తారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశారు. తర్వాత ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోలేదా??. ఫెయిల్ అయిన ఫార్ములా.” అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.