Merugu Nagarjuna : ఏపీలో చదువులమ్మ తల్లిని చంద్రబాబు అటకెక్కిస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చదువుకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా… అమ్మ ఒడి ద్వారా ప్రతీ తల్లి ఖాతాలో 15 వేల రూపాయలు జమచేశారని, ఏపీలో గొప్ప సంస్కరణలకు జగన్ ఆధ్యుడని ఆయన తెలిపారు. చంద్రబాబు అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరుమార్చారని, ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ 15 వేలు ఇస్తామని ఊదరగొట్టారన్నారు. ఇంటింటికి వెళ్లి నీకు 15 వేలు నీకు 15 వేలు అని చెప్పి నమ్మించారని, అధికారం లోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయ్యిందని చంద్రబాబు చెబుతున్నాడన్నారు మేరుగ నాగార్జున.
తల్లికి వందనం పథకాన్ని ఇన్స్టాల్మెంట్ లో ఇస్తామంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రతీ కుటుంబాన్ని ఆదుకుని చదివించిన జగన్ ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, ఇచ్చిన మాట తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత జగన్ ది అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు తీరు ఓడదాటే వరకూ ఓడ మల్లన్న దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా ఉందని, మంచినీరు దొరకడం లేదేమో కానీ ఏపీలో మందు ఏరులై పారుతోందన్నారు. తల్లికి వందనం పథకానికి ఎలాంటి షరతులు పెట్టకుండా వెంటనే ఇవ్వాలని, సామాజిక విప్లవంలో పేటెంట్ తెచ్చుకున్న జగన్ ఆలోచనలు అమలు చేయాలని ఆయన కోరారు. 72,919 కోట్లను విద్య కోసం జగన్ మోహన్ రెడ్డి ఖర్చు చేశారని ఆయన అన్నారు.