కోవిడ్ బాధితులకు గుడ్‌న్యూస్.కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్… ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ ఔషధాలపై మాత్రం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ మెర్క్ రూపొందించిన ఔషధం… ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు చూపించినట్లు వెల్లడించింది. కొత్తగా వైరస్ బారినపడుతోన్న బాధితులకు ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలను సగానికి తగ్గించినట్లు తెలిపింది. త్వరలోనే అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకోనున్నట్లు మెర్క్ ఫార్మా వెల్లడించింది.రిడ్జ్‌బ్యాక్ బయోథెరపిక్స్ భాగస్వామ్యంతో… మెర్క్ ఫార్మా సంస్థలు మాత్ర రూపంలో తయారు చేసిన మోల్నూపిరవిర్ ఔషధంపై ప్రయోగాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా 775 మంది వాలంటీర్లకు వీటిని ఇచ్చారు. కొవిడ్ లక్షణాలు వెలుగు చూసిన ఐదు రోజుల్లో… ఈ మాత్రలను వాడి చూశారు. వీరిలో డమ్మీ ఔషధం ఇచ్చిన వారితో పోల్చితే…మోల్నూపిరవిర్ తీసుకున్న సగం మందికి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా పోయింది. అంతేకాకుండా ప్లెసిబో తీసుకున్న వారితో పోలిస్తే మోల్నూపిరవిర్ మాత్రలు వాడిన బాధితుల్లో… మరణాలు అతి స్వల్పమని తేలింది. కొవిడ్-19ను ఎదుర్కోవడంలో మోల్నూపిరవిర్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోందని నిపుణులు వెల్డించారు. ఈ మాత్రలతో కలిగే దుష్ర్పభావాలు కూడా సాధారణంగా ఉన్నట్లు వెల్లడించారు. కొవిడ్ చికిత్సలో వినియోగిస్తోన్న ఇంజక్షన్ రూపంలో ఉన్న ఔషధాల కంటే… మాత్రల రూపంలో ఉన్న ఈ ఔషధం బాధితులకు ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.