NTV Telugu Site icon

Memantha Siddham: ఎమ్మిగనూరులో ‘మేమంతా సిద్ధం’ సభ.. భారీగా తరలివచ్చిన జనం

Cm Jagan

Cm Jagan

Memantha Siddham: కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర 3వ రోజుకు చేరుకుంది. ఎమ్మిగనూరులో భారీగా నిర్వహిస్తోన్న ‘మేమంతా సిద్ధం’ సభకు.. లక్షలాదిగా జనం తరలివచ్చారు. నేడు దిగ్విజయంగా సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగింది. గూడూరు మండలం పెంచికలపాడు నుంచి కొత్తూరు, పాలకుర్తి మీదుగా కోడుమూరుకు.. కోడుమూరు నుంచి వర్కురు, వేముగొడు, పుట్టపాశం, హెచ్ కైరవాడి, గోనెగండ్ల, రాల్లదొడ్డి వరకు బస్సు యాత్ర సాగింది. రాల్లదొడ్డి శివారులో భోజన విరామం తీసుకున్నారు. అనంతరం ఎర్రకోట మీదుగా ఎమ్మిగనూరుకు బస్సుయాత్ర చేరింది. ఎమ్మిగనూరులో ‘మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభకు చేరుకున్న సీఎం జగన్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈలలు,కేకలతో అభిమానులు స్వాగతం పలికారు. గంటల కొద్ది మండుటెండలో నిల్చోని కార్యకర్తలు అభిమానం చాటుకున్నారు. కార్యకర్తలకు, నాయకులకు చేతులు జోడించి సీఎం అభివాదం చేశారు.

ఈ యాత్రలో భాగంగా కొత్తూరులో పలువురు మహిళలతో ముచ్చటించి ఓ చిన్నారిని జగన్ ముద్దాడారు. కోడుమూరులో చేనేత, కురువ, క్షత్రియ సమాజికవర్గాలకు చెందిన ప్రతినిధులతో జగన్ ముచ్చటించారు. గొర్రెపిల్ల, కంబలి, మగ్గం నమూనా, పట్టుచీర, కత్తి జగన్‌కు బహుకరించారు. కోడుమూరులో నిర్వహించిన రోడ్ షోలో జనం భారీ ఎత్తున పాల్గొన్నారు. బస్సు పైకి ఎక్కి రోడ్‌షోలో సీఎం జగన్ పాల్గొన్నారు.

కూలీకి చెప్పులు ఇప్పించిన సీఎం జగన్‌..
వైఎస్ అభిమాని , కూలీ ఖాసీంకు చెప్పులు ఇప్పించారు సీఎం జగన్. ఇంతకీ ఎవరా వ్యక్తి ఏంటా కథ అంటే.. కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన దూదేకుల ఖాసీం .. జగన్ కు వీరాభిమాని. 2010లో జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు ఆయనను కలిసిన ఖాసీం జగన్ సంకల్పానికి చలించిపోయాడు . ప్రజల కోసం మండుటెండలని సైతం లెక్క చెయ్యని జగన్ పై ఆయన అభిమానం రెట్టింపు అయ్యింది. వైయస్ఆర్ బిడ్డ ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాక్షించారు. ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ జగన్ మోహన్ రెడ్డిని కలిసేంతవరకూ తాను చెప్పులు ధరించనని గ్రామస్తులు అందరి సమక్షంలో శపధం చేశాడు. ఇక శపథానికి కట్టుబడి 14 సంవత్సరాలుగా పాదరక్షలు లేకుండానే నడక సాగిస్తున్నాడు. ఎర్రటి ఎండలోనూ, రోడ్లు అట్లపెనంలా కాలుతున్నా జగనన్న కోసం చెప్పులు లేకుండా నడవడంలో తనకు ఆనందం ఉందంటున్నాడు ఖాసిం. సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవాలని ఉందని, తనను ఎవరైనా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకువెళ్లాలని కోరుతున్నాడు. 14 ఏళ్ల పాటు ఎండలో కాళ్లు మండిన, వర్షంలో తడిచిన, పొలం గట్ల వద్ద ముల్లులు కుచ్చుకున్నా ఖాసీం ప్రతిజ్ఞ విరమించలేదు. ఈ క్రమంలోనే ఖాసీంను సీఎం జగన్ వద్దకు తీసుకొని వెళ్ళారు ఎమ్మెల్యే శిల్పారవి. సీఎం జగన్‌ ఖాసింను అభినందించి చెప్పులు ఇప్పించారు. జగన్‌ను చూడగానే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వచ్చారని ఖాసిం అన్నాడు.