Medaram Jatara: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా తక్షణం స్పందించి వైద్యం అందించేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు శనివారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతర ఏర్పాట్లపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రూపొందించిన ప్రణాళికను మంత్రి పరిశీలించారు. ఇప్పటికే లక్షల మంది భక్తులు ముందస్తుగానే జాతరకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గద్దెల వద్ద, జంపన్న వాగు సమీపంలో, ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద 3 వైద్య శిబిరాలను ప్రారంభించామని అధికారులు మంత్రికి వివరించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నందున జాతర పరిసరాలలో మరిన్ని మెడికల్ క్యాంపులను ముందస్తుగానే ప్రారంభించాలని అధికారులకు మంత్రి సూచించారు. భక్తులు మేడారం బయలుదేరిన దగ్గరి నుంచి.. అమ్మవార్లను దర్శించుకుని క్షేమంగా ఇళ్లకు చేరేంత వరకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మేడారం చేరుకునే అన్ని రూట్లలోనూ మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.
READ MORE: Trump-Nicolas Maduro: కిడ్నాప్‌కు మందు మదురోకు ఎలాంటి ఆఫర్లు వచ్చాయి? చివరికేమైంది?
50 పడకల ప్రధాన ఆసుపత్రి..
జాతరలో అత్యవసర వైద్య సేవల కోసం మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకలతో కూడిన ప్రధాన హాస్పిటల్ (శ్రీ సమ్మక్క సారలమ్మ వైద్యశాల) ఏర్పాటు చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. దీనికి అదనంగా జంపన్న వాగు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద 6 పడకల సామర్థ్యంతో రెండు మినీ హాస్పిటళ్లు, జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు వచ్చే 8 ప్రధాన రూట్లలో, ఎక్కడా వైద్య సేవలకు లోటు రాకూడదని మంత్రి సూచించారు. ఇందుకోసం 42 ఎన్-రూట్ (En-route) మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హనుమకొండ – మేడారం రూట్‌లో అత్యధికంగా 9 క్యాంపులు, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే భక్తుల కోసం 6 క్యాంపులు, భద్రాచలం రూట్‌లో 5 క్యాంపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి భారీగా వైద్య సిబ్బందిని మోహరించాలని మంత్రి ఆదేశించారు. పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి మొత్తం 3,199 మంది సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇందులో 72 మంది స్పెషలిస్టులు, 42 మంది లేడీ డాక్టర్లతో కలిపి 544 మంది వైద్యులు విధుల్లో ఉంటారు. వీరికి తోడుగా 2,150 మంది పారామెడికల్ సిబ్బంది (నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు) షిఫ్టుల వారీగా 24 గంటల పాటు సేవలు అందించనున్నారు.
READ MORE: ISRO: రేపే PSLV-C62 రాకెట్ ప్రయోగం.. చెంగాళమ్మ పరమేశ్వరి దేవికి ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు..
అత్యవసర సేవలకు 35 అంబులెన్సులు
గుండెపోటు, ప్రమాదాల వంటి అత్యవసర సమయాల్లో గోల్డెన్ అవర్లో చికిత్స అందించేలా 35 అంబులెన్సులను సిద్ధం చేశామని ధికారులు తెలిపారు. మెరుగైన వైద్యం అవసరమైతే పేషెంట్లను ములుగు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు, వరంగల్ ఎంజీఎంలకు తరలించాలని మంత్రి సూచించారు. ఈ రెండు హాస్పిటళ్లలో నెల రోజుల పాటు డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. చిన్నపిల్లల మందుల దగ్గరి నుంచి పాముకాటు విరుగుడు ఇంజెక్షన్ల వరకు 248 రకాల మందులు, సర్జికల్ సామాగ్రిని ద్వారా ముందస్తుగానే సిద్ధం చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే జనవరి 25వ తేదీ నుంచి అన్ని వైద్య శిబిరాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. తక్షణమే మేడారం వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్‌ను మంత్రి ఆదేశించారు.