NTV Telugu Site icon

Fire Breaks Out: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 40 బట్టల దుకాణాలు దగ్ధం

Fire Breaks Out

Fire Breaks Out

Fire Breaks Out: హైదరాబాద్ లోని పాతబస్తీలో ఉన్న దివాన్‌దేవిడి ప్రాంతంలోని మదీనా అబ్బాస్ టవర్స్‌లో తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం అర్ధరాత్రి దాటాక ఉదయం 2:15 గంటలకు జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నాలుగో అంతస్తులో ఉన్న 40కి పైగా బట్టల దుకాణాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 10 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మదీనా సర్కిల్ వద్ద మంటలతో దట్టమైన పొగలు వ్యాపించాయి. భవనంలో ఒక మూలాన ఉన్న షాప్ లో మంటలు చెలరేగడంతో అవి కాస్త చిన్నగా ఇతర షాపులకు మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా, భవనం ఇరుకుగా ఉండటం వల్ల లోనికి వెళ్లి ఆపరేషన్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Read Also: Maha Kumbh Mela: కుంభమేళా ఏర్పాట్లపై కాంగ్రెస్ డిప్యూటీ సీఎం ప్రశంసలు

ఎన్‌టివి‌తో హైదరాబాద్ జిల్లా ఫైర్ శాఖ అధికారి వెంకన్న మాట్లాడుతూ.. ‘తెల్లవారు 2:15 గంటల సమయంలో అగ్నిప్రమాదం సమాచారం వచ్చిందని, దాంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకుని 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశామని తెలిపారు. నాలుగో అంతస్తులో ఉన్న 40 దుకాణాలు పూర్తిగా తగలబడిపోయాయి. అయితే, మంటల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా మరో ఇతర విషయం ద్వారానా అని దర్యాప్తులో తేలుతుందని వివరించారు. ఇక మంటల ధాటికి భవనం స్లాబ్ ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఆ దుకాణాల్లో ఉన్న బట్టలు పూర్తిగా కాలిపోవడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. ప్రస్తుతానికి ఆస్తి నష్టానికి సంబంధించిన స్పష్టమైన అంచనాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రాణ నష్టం జరిగినట్లుగా ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఈ ప్రమాదం పాతబస్తీలో తీవ్ర ఆందోళన రేపుతోంది.