NTV Telugu Site icon

Microsoft Windows outage: గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు ఆలస్యం

Gannavaram

Gannavaram

Microsoft Windows outage: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాంకేతిక లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్‌ సర్వర్లు నిలిచిపోయాయి. దీనివల్ల పలు విమాన సర్వీసులు ఆలస్యం కాగా.. బోర్డింగ్ పాసులపై మాన్యువల్‌గా రాసి ప్రయాణికులను పంపిస్తున్నారు. రోజుకు గన్నవరం నుండి 23 విమాన సర్వీసులు వివిధ ప్రదేశాలకు బయలుదేరి వెళ్లవలసి ఉన్నాయని గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఏకే లక్ష్మీకాంత్‌ రెడ్డి వెల్లడించారు.

Read Also: Ashwini Vaishnaw: మైక్రోసాఫ్ట్ సర్వర్‌ అంతరాయంపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఏమన్నారంటే..?

ఇప్పటి వరకు 13 విమాన సర్వీసులు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లగా.. 7 విమాన సర్వీసులు ఆలస్యంగా బయలుదేరి వెళ్లాయని ఆయన వెల్లడించారు. ఇదే ఆలస్యం సాయంత్రం వరకు కొనసాగితే ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. క్లౌడ్ సర్వర్, మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపం వల్ల ఉదయం నుంచి కొన్ని విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని.. ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలలో విమాన సర్వీసులకు ఇదే పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకుని వస్తున్న విమానయాన ప్రయాణికులకు, మాన్యువల్‌గా బోర్డింగ్ పాసులు ఇస్తున్నామన్నారు.

గన్నవరం విమానాశ్రయంలో టికెట్‌ కౌంటర్‌లో ప్రయాణికులకు టికెట్లు నిలిపివేశామని.. ఇదే సమస్య రెండు మూడు రోజులు కొనసాగితే, విమాన సర్వీసులు నడపడం కష్టమన్నారు. క్లౌడ్ మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపం త్వరితగతిన పునరుద్దించాలని కోరుకుంటున్నామని గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఏకే లక్ష్మీకాంత్‌ రెడ్డి అన్నారు.