Manoj Tiwary Said I want to ask MS Dhoni why he left me out of the Team: టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మిగతా వారితో పోల్చితే.. భారత జట్టులో తనకు తగినన్ని అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సెంచరీ చేసినా తర్వాతి మ్యాచ్‌లోనే తనను ఎందుకు తొలగించారని అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీని అడగాలనుకున్నా అని మనోజ్ తివారి తెలిపాడు. తనకు అవకాశాలు లభిస్తే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మాదిరి హీరో అయ్యేవాడిని (ఉన్నత శిఖరాలు) అని చెప్పుకొచ్చాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా బిహార్‌తో మ్యాచ్ అనంతరం 19 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు మనోజ్ తివారి తెలిపాడు.
మంగళవారం కోల్‌కతా స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ క్లబ్‌లో మనోజ్ తివారికి సన్మానం జరిగింది. ఈ సందర్భంగా తివారీ విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. ‘2011లో సెంచరీ చేశాను. తర్వాతి మ్యాచ్‌లోనే నన్ను తుది జట్టు నుంచి తప్పించారు. నాపై ఎందుకు వేటు వేశారని ఎంఎస్ ధోనీని అడగాలనుకున్నా. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలా రాణించగల సత్తా నాకుంది. కానీ నాకు అవకాశాలు రాలేదు. ఈరోజుల్లో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. యువకులకు అవకాశాలు రావడం చూసినప్పుడు నా విషయంలో బాధగా అనిపిస్తుంది’ అని మనోజ్ తివారి చెప్పాడు.
Also Read: Bull Stops Cricket Match: క్రికెట్ మ్యాచ్‌ను ఆపేసిన ఎద్దు.. వీడియో వైరల్!
ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోనే మనోజ్ తివారి అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2008-2015 మధ్య టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అతడు 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. వన్డే ఫార్మాట్‌లో 287, టీ20 ఫార్మాట్‌లో 15 పరుగులు చేశాడు. 2011లో వెస్టిండీస్‌పై చెన్నైలో ఏకైక సెంచరీ చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 148 మ్యాచ్‌లు ఆడిన తివారి.. 10195 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 45 అర్ధ శతకాలు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్‌లో 169 మ్యాచ్‌లలో 5581 రన్స్ చేశాడు. ఇందులో 6 సెంచరీలు , 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.